High alert in AP as first case reported in Vijayawada:
జనతా కర్ఫ్యూ రోజున రోడ్ల మీదకు రాని జనం సోమవారం ఎక్కడికక్కడ రోడ్ల మీదకు జనం చేరిపోయారు. దీంతో ప్రభుత్వాలకు తలనొప్పిగా తయారైంది. విజయవాడ నగరంలో లాక్డౌన్పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సోమవారం పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ విజయవాడలో లాక్డౌన్ను లెక్కచేయకుండా రోడ్లపైకి ప్రజలు వస్తున్నారని విచారం వ్యక్తంచేశారు.
అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారి సంఖ్య ఎక్కువ అవుతుందని, అటువంటివారిని ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించమని సిపి తిరుమలరావు స్పష్టం చేశారు. రోడ్లపైకి వచ్చిన వారిని నియంత్రించే పనిలో పోలీసులు ఉన్నారని చెప్పారు. అన్ని ప్రధాన కూడలిలో బరికేడ్స్ పెట్టి వాహనాలు నియంత్రణ చేస్తున్నామన్నారు.కరోనా పాజిటివ్ నమోదైన కొత్తపేట ప్రాంతాన్ని పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారని కమిషనర్ చెప్పారు.
మూడు కిలోమీటర్ల పరిధిలో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టామన్నారు. గుంటూరు జిల్లా నుంచి బ్యారేజీ మీదుగా వచ్చే వాహనాలు సైతం సీతానగరం వద్ద నుంచి వెనక్కి పంపించి వేస్తున్నామని, నిబంధనలు వ్యతిరేకించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరికి వారు వారి వారి నివాసాల సమీపంలో పచారీ దుకాణాలు, కూరగాయలు మాత్రమే కొనుక్కోవాలని సిటీ పోలీస్ కమిషనర్ సూచించారు.