Home రాజకీయం జనతా కర్ఫ్యూ కోసం ప్రధాని కసరత్తు

జనతా కర్ఫ్యూ కోసం ప్రధాని కసరత్తు

PM Narendra modi

Indian Prime Minister Narendra Modi speaks About Coronavirus:

కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు ఈ నెల 22 ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దేశమంతటా జనతా(స్వచ్ఛందంగా) కర్ఫ్యూ పాటించాలని పిలుపునిచ్చారు. ఆ సమయంలో ఎవరూ తమ ఇల్లు, సొసైటీ లేదా భవనం నుంచి బయటకు రావొద్దని ఆయన సూచించారు. మనల్ని మనం కాపాడుకోవడానికి, ఆరోగ్యంగా ఉండటానికి తప్పనిసరిగా సంయమనం పాటించాలన్నారు. రాబోయే కొద్ది రోజులపాటు చాలా ముఖ్యమైన పని ఉంటేనే ప్రజలు తమ ఇళ్ళ నుంచి బయటకు రావాలని తెలిపారు. కరోనా వైరస్ మహమ్మారిపై యుద్ధం గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం రాత్రి జాతిని ఉద్దేశించి కీలక ప్రసంగం చేసారు.ఈ సంక్షోభం యావత్తు మానవాళిని చుట్టుముట్టిందన్నారు.‘‘నేను బాగున్నాను, నాకేమీ జరగదు’’ అనుకోవడం తప్పు అని చెప్పారు.

కరోనా వైరస్ ప్రపంచమంతటికీ వ్యాపిస్తోందన్న వార్తలను గత రెండు నెలలుగా మనమంతా ఆందోళనతో గమనిస్తున్నామని ప్రధాని గుర్తుచేస్తూ, మానవాళిని సంక్షోభంలోకి నెట్టిన ఈ మహమ్మారి పట్ల దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈ వైరస్‌తో యుద్ధం చేస్తున్న ప్రపంచం గందరగోళంలో ఉందన్నారు. మొదటి ప్రపంచ యుద్ధంనాటి పరిస్థితులు నేడు ఉన్నాయని, మనమంతా కలిసికట్టుగా దీనిపై పోరాడాలని తెలిపారు. కరోనా వైరస్‌ నిరోధానికి వ్యాక్సిన్లు లేవని, చాలా పరిశోధనలు చేసినప్పటికీ సత్ఫలితాలు రాలేదని చెప్పారు. ఈ వైరస్ బాధితులను ఏకాంత ప్రదేశంలో ఉంచి, చికిత్స చేయిస్తున్నట్లు తెలిపారు.

కరోనా వైరస్‌ను తేలిగ్గా తీసుకోరాదని, మనమంతా గట్టి సంకల్పం చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. దీనిని చిత్తశుద్ధితో ఎదుర్కొనాలన్నారు. దీటుగా ఎదుర్కొనగలమనే నమ్మకమే మనల్ని గెలిపిస్తుందన్నారు. ఈ మహమ్మారిని ఎదుర్కొనడం, తిప్పికొట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసే కృషితోపాటు ప్రతి ఒక్కరి సంకల్పం ముఖ్యమని తెలిపారు. సామాజికంగా కట్టుబాట్లతో వ్యవహరించాలని పేర్కొన్నారు. సామూహికంగా ఒక చోట చేరకుండా జాగ్రత్తపడాలన్నారు. మనం ఆరోగ్యంగా ఉంటే, దేశం ఆరోగ్యంగా ఉంటుందని తెలిపారు. అనారోగ్యంగా ఉన్నవారు, కరోనా లక్షణాలు ఉన్నవారు జనంలో తిరిగితే, తమకు తామే అన్యాయం చేసుకున్నవారు అవుతారని, అంతేకాకుండా తమ కుటుంబాలకు, యావత్తు సమాజానికి అన్యాయం చేస్తున్నట్లేనని ప్రధాని హెచ్చరించారు

Exit mobile version