Industrialist nimmagadda prasad return to india from serbia:
ఒకప్పుడు ఓ ఎంటర్ టైన్ మెంట్ ఛానల్ లో కీలక భూమిక వహించిన ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కి సెర్బియా పోలీసు నిర్బంధం నుంచి మోక్షం లభించింది. దాదాపు 9 నెలలుగా సెర్బియా పోలీసుల నిర్బంధంలోనే ఉన్న నిమ్మగడ్డ, ఎట్టకేలకు రిలీజ్ అవ్వడంతో గురువారం హైదరాబాద్ చేరుకున్నారు. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో సెర్బియా నుంచి అంతర్జాతీయ ఫ్లైట్ లో హైదరాబాద్ చేరుకున్న నిమ్మగడ్డను వైద్యులు క్వారంటైన్ కు తరలించారు. సెర్బియా నిర్బందం నుంచి చాలా కాలం తర్వాత విడుదలైన నిమ్మగడ్డ, కరోనా వైరస్ నేపథ్యంలో మరో 14 రోజుల పాటు బయట ప్రపంచానికి దూరంగానే ఉండాలి.
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రస్ ఆల్ ఖైమా ఏపీలో పెట్టుబడులు పెట్టిన విషయంలో నిమ్మగడ్డ దురుద్దేశపూర్వకంగా వ్యవహరించారని ఈ కారణంగా రస్ ఆల్ ఖైమా పెట్టుబడులు నిరుపయోగమయ్యాయని వాటిని తమకు వెనక్కి ఇప్పించాలని అరబ్ దేశాల ద్వారా రస్ ఆల్ ఖైమా భారత ప్రభుత్వానికి విన్నవించింది. దీనిపై అరబ్ కంట్రీస్ తో భారత్ సంప్రదింపులు చేస్తుండగా, ఏదో పని మీద నిమ్మగడ్డ సెర్బియా వెళ్లారు. విషయం పసిగట్టిన అరబ్ కంట్రీస్, సెర్బియా ప్రభుత్వంతో మాట్లాడి నిమ్మగడ్డను అరెస్ట్ చేయించింది. ఈ విషయంపై భారత్ పెద్దగా స్పందించలేదు. దీంతో ఇన్నాళ్లూ సెర్బియా పోలీసుల అదుపులోనే ఉన్నారు.
అయితే , ఏమైందో ఏమో గానీ, నిమ్మగడ్డను సెర్బియా పోలీసులు విడుదల చేసేందుకు సమ్మతించారు. దీంతో నిర్బంధం నుంచి బయటకొచ్చిన నిమ్మగడ్డ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా, హైదరాబాద్ బయలుదేరారు. అయితే హైదరాబాద్ చేరుకున్న సమయంలో కరోనాపై హైఅలర్ట్ పరిస్థితులు నెలకొన్నాయి. విదేశాల నుంచి ఎవరు వచ్చినా.. వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తూ, అటు నుంచి అటే క్వారంటైన్ కు తరలిస్తున్నారు. దీంతో శంషాబాద్ ఎయిర్ పోర్టులోనే నిమ్మగడ్డను నిలిపేసిన వైద్యులు ఆయనకు వైద్య పరీక్షలు చేసి, క్వారంటైన్ కు తరలించారు.