infosys founder narayana murthy suggestions after lockdown
కరోనా మహమ్మారి ప్రపంచానికి కునుకులేకుండా చేస్తోంది. అన్ని దేశాలు లాక్ డౌన్ ని విధించి నెమ్మదిగా సడలింపులు ఇస్తూ వస్తున్నారు. మనదేశంలో ఇప్పటికే రెండు దఫాలు లాక్ డౌన్ విధించారు. రెండవ దఫా లాక్ డౌన్ మే 3తో ముగుస్తోంది. ఆ తర్వాత ఏమిటన్నది అందరిలో మెదులుతున్న సమస్య. ఇప్పటికే కొన్ని మినహాయింపు ఇవ్వగా ,మరిన్ని మినహాయింపులు ఇస్తూ లాక్ డౌన్ కొనసాగిస్తారన్న మాట వినిపిస్తోంది. ఎందుకంటే ఆర్దిక వ్యవస్థను పట్టాలెక్కించాలంటే కొన్ని సడలింపులు అవసరమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈనేపధ్యంలో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి స్పందిస్తూ,.. వచ్చే రెండు మూడేళ్ల పాటూ వారానికి 60 గంటల చప్పున కష్టపడతామంటూ భారతీయులు ప్రతిన పూనాలని సూచించారు. కునారిల్లుతున్న దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టా లెక్కించ డానికి ఇది అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. వ్యాపారానికి ఎదురవుతున్న అడ్డంకులను తొలగించేందుకు 1991లో లాగా.. నిపుణులతో కూడిన ప్రత్యేక కమిటీని నియమించాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు.
ఇక రాబోయే సంత్సరన్నర పాటూ కరోనాతో సహవాసం చేసేందుకు ప్రజలు అలవాటు పడాలని కూడా మూర్తి తేల్చారు.కరోనాతో ఎవరెవరూ ఎక్కువ ప్రభావితమవుతారు అనే అంశం ఆధారంగా వ్యాపారాలు తెరవాలో లేదో నిర్ణయించుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ‘ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా చర్యలు తీసుకుందాం, వ్యక్తిగత అభిప్రాయాల ఆధారంగా కాదు’ అని నారాయణ మూర్తి స్పష్టంగా చెప్పారు.