IT Minister KTR for exploring new opportunities in post-Covid world
లాక్ డౌన్ వల్ల తలెత్తిన సంక్షోభ పరిస్థితుల్లో పరిశ్రమలు, ఐటి కంపెనీలు అనేక అవకాశాలను అందుకునే వీలుందని, ఇందుకు సంబంధించి కేంద్ర, రాష్ట్రాలు సహాయకారిగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో మంత్రి కేటీఆర్ సూచించారు. అన్ని రాష్ట్రాల ఐటి శాఖ మంత్రులతో జరిగిన ఈ సమావేశంలో కోవిడ్ 19 వ్యాధి సంక్షోభంపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కరోనా వైరస్ కట్టడి కోసం ఆయా ప్రభుత్వాలు చేపట్టిన చర్యలు, ముఖ్యంగా ఐటి సంబంధిత కార్యక్రమాల పైన ఆయా రాష్ట్రాల మంత్రులు పలు సలహాలు సూచనలను కేంద్ర ప్రభుత్వం తెలుసుకుంది.
వాటిలో బాగంగా జపాన్ వంటి కొన్ని దేశాలు తమ తయారీ యూనిట్లను చైనా నుంచి ఇతర దేశాలకు తరలించడానికి చూస్తున్నారు. వారు వాటిని బహిరంగంగా ప్రకటిస్తున్న వేళ ఆ కంపెనీలను భారతదేశానికి తీసుకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కేటీఆర్ సూచించారు. తద్వారా దేశంలో ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే చైనా నుంచి తరలి పోయే మరి కొన్ని పరిశ్రమలు ముఖ్యంగా ఐటీ సంబంధిత ఎలక్ట్రానిక్స్ రంగంలోని కంపెనీలను భారతదేశానికి తీసుకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని, అలాగే ఇప్పటికే తెలంగాణలో ఉన్నటువంటి రెండు ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్లు నిండిపోయాయని మరో రెండు ఈఎంసీలకు అనుమతులు ఇవ్వాలని కేటీఆర్ కేంద్ర మంత్రిని ఈ సందర్బంగా కోరారు.
రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇచ్చిన సూచనలను సలహాలను కేంద్ర ఐటీ శాఖ మంత్రి సానుకూలంగా పరిశీలిస్తామని, ఇంటర్నెట్ సేవలను మరింత బలోపేతం చేసేందుకు భారత్ నెట్ కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆరోగ్య సేతు సేవలను మరింతగా ఉపయోగించుకోవాలని మరియు ఆరోగ్య సేతును మరింత ముందుకు తీసుకు వెళ్లాలని రాష్ట్రాల ఐటీ శాఖ మంత్రులకు సూచించారు