jabardasth artist jeevan Corona stars behind the aid
కరోనా మహమ్మారి ధాటికి ఇప్పుడు చాలా మంది ఆకలి బాధలు పడుతున్నారు. వారికి ఆర్టిస్ట్ జీవన్ నిరంతరాయంగా సేవలు చేస్తున్నాడు. గత 15 రోజులుగా దాదాపు రోజుకు వెయ్యి మందికి కడుపులు నింపుతున్న అతడు ఇప్పుడు నిత్యావసర సరుకులు రెండు వేల మందికి పంచుతున్నాడు. తన సంపాదన మొత్తం ఖర్చు అయినా పర్లేదు కానీ పరులకు చేసే సాయం ఇచ్చే సంతృప్తికి సాటి రాదు అంటున్నాడు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. లాక్డౌన్ అయిన మరుసటి రోజు నుంచి తన రెస్టారెంట్‌ని కరోనా బారిన పడి ఆకలితో అవస్థలు పడుతున్న వారిని ఆదుకునే సేవా కేంద్రంగా మలిచాడు.
ప్రతి రోజూ వెయ్యి మందికి పైగా సరిపడే ఆహారం తయారు చేసి సైబరాబాద్ కోవిడ్ కంట్రోల్ రూమ్ అధికారి ప్రవీణ్ రెడ్డి బృందానికి జీవన్ అందిస్తున్నాడు. అక్కడి నుంచి అవరసరమైన వారికి పోలీసులు సరఫరా చేస్తారు. ఒక్కోసారి జీవన్ వారితో పాటు వెళ్ళి ఆహారాన్ని అందిస్తాడు. భోజనంతో పాటు కూరగాయలు కూడా కొన్ని రోజులు సంగారెడ్డి రైతుల దగ్గర నుండి జీవన్ బృందం నేరుగా కొనుగోలు చేసి అందించింది. ఇప్పడు రెండు వేల మందికి వారం రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులు సరఫరా చేసేందుకు రెడీ అయ్యాడు. ఈ సహాయక చర్యలకు జీవన్‌కి ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్, నటి అనసూయ, హారితేజ, నటులు అభినవ్ గోమఠం మరికొందరు అండగా నిలిచారు.
ఈ సందర్బంగా డైరెక్టర్ తరుణ్ భాస్కర్ స్పందిస్తూ,’ స్వచ్చంధంగా ముందుకు వచ్చి ఆకలితో ఉన్న వాళ్ళకు కడుపులు నింపుతున్న జీవన్ నా ఫ్రెండ్ అయినందుకు గర్వపడుతున్నా. తన రెస్టారెంట్ స్టాఫ్‌ని ఇలాంటి పరిస్థితుల్లో సమాజం కోసం పనిచేసేలా నడిపిస్తున్నాడు..’’ అన్నాడు. అనసూయ స్పందిస్తూ,’వాళ్ళు చేస్తున్న సేవలకు నేను సపోర్ట్‌గా నిలిచాను. కేవలం మనుషులకే కాకుండా వీధి కుక్కలకు జీవన్ బృందం ఆహారం అందిస్తుంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సమాజం గురించి ఆలోచిస్తున్న జీవన్‌కి సపోర్ట్‌గా నిలవాలి’’ అని పేర్కొంది. ‘‘మా పార్టనర్ అభినవ్ అండగా నిలబడ్డంతో నేను మొదట నా సేవింగ్స్నే ఖర్చు చేసి ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించా. మా ప్రయత్నానికి దర్శకుడు తరుణ్ భాస్కర్ మరియ అతని ఫ్యామిలీ అండగా నిలిచారు. సంపాదన కంటే ఎదుటి వారి ఆకలి తీర్చడంలో నాకు ఎక్కువ సంతృప్తి కలిగింది..’’అని జీవన్ అంటున్నాడు.