Jagan Government Constitutes SIT
మొత్తానికి ఎపి సీఎం జగన్ అనుకున్నంత పని చేస్తున్నారా అనిపిస్తోంది. ఎందుకంటే తాజాగా ఇచ్చిన జీవో ఇందుకు నిదర్శనం. రాజధాని భూముల వ్యవహారంలో మంత్రి వర్గ ఉపసంఘం నివేదికలో పేర్కొన్న అంశాలపై విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేస్తూ, ఎపి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంటెలిజెన్స్ డీఐజీ కొల్లి రఘురాంరెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ ఏర్పాటు చేసింది. భూ లావాదేవీల్లో అక్రమాలు జరిగాయని మంత్రివర్గ ఉపసంఘం నివేదికలో పేర్కొంది.
ఆ లావాదేవీలతో సంబంధమున్న వ్యక్తులనెవరినైనా విచారణకు పిలిచే అధికారం ఉందంటూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ జీవో జారీ చేసింది. అయితే గత ప్రభుత్వ నిర్ణయాలన్నింటినీ తిరగదోడేందుకు సిట్ ఏర్పాటు చేయడం ఇదే తొలిసారని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. జగన్ తాజా నిర్ణయం తీవ్ర కలకలం రేపుతోంది. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు హయాంలో తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన ప్రాజెక్టులు, ఏర్పాటు చేసిన సంస్థలు, కార్పొరేషన్లు, అన్నింటిపైనా సమగ్ర విచారణకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.
మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా సిట్ దర్యాప్తు చేపట్టనుంది. సీఆర్డీఏ పరిధిలో భూలావాదేవీలు సహా అన్ని ప్రభుత్వ పథకాలు, కార్పొరేషన్ల వ్యవహారాలు సిట్ పరిధిలోకి వస్తాయంటూ జీవోలో స్పష్టం చేసింది. మొత్తం మీద గత టిడిపి ప్రభుత్వ నిర్ణయాలను, పథకాలను తిరగదోడేందుకు జగన్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ఈ జీవో చెప్పకనే చెబుతోంది.