Jr. N.T.R starts new business in cinema industry:
ఏ రంగంలో అయినా సరే, లాభాలు గడించి కూడబెట్టాలన్నదే ఉద్దేశ్యం. కోట్లకు కోట్ల బిజినెస్ లా సాగుతున్న సినీ పరిశ్రమ కూడా ఇందుకు ఏమాత్రం మినహాయిపు లేదు. సినీ ఇండస్ట్రీలో నిర్మాతలుగా మారిన హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, కమెడియన్స్ ఇంకా చెప్పాలంటే చిన్నా చితకా క్యారెక్టర్స్ చేసే ఆర్టిస్టులు కూడా నిర్మాతలుగా మారారు. ఇక స్టార్ హీరోల సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉన్న నేపథ్యంలో టాక్ తో సంబంధం లేకుండా మినిమమ్ వసూళ్లు వస్తుంటాయి. అలాగే పెట్టుబడికి లాభం కలుపుకొని సినిమా నిర్మాతలు అమ్మేసుకుంటారు.
ఇక డిజిటల్ , శాటిలైట్ రైట్స్ సరేసరి. స్టార్ హీరోతో సినిమా అంటే లాభాలు గ్యారంటీ అనే పరిస్థితి నెలకొని ఉంది. ఈ అడ్వాంటేజ్ ని స్టార్ హీరోలు సైతం క్యాష్ చేసుకుంటున్నారు. అందుకే మన తెలుగు ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోలు తమ పంథా మార్చేసి, తాము నటించే ప్రతి సినిమా నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఉవ్విళూరుతున్నారు. ఒకప్పుడు అక్కినేని నాగార్జున తాను నటించే ప్రతి సినిమాలో భాగస్వామిగా ఉంటూ చిత్ర లాభ నష్టాలలో పాలుపంచుకుంటూ, సక్సెస్ అయ్యాడు. తర్వాతి రోజుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ వంటి హీరోలు ఈ రూట్ లోకి వచ్చేసారు.
కొంచెం ఆలస్యంగా మేల్కొన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా అదే బాట పడుతున్నాడు.
వరుస విజయాలతో దూకుడు మీదున్న ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం నుండి చిత్ర నిర్మాణంలో భాగస్వామి అవ్వాలనుకుంటున్నాడట. ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ తెరకెక్కిస్తుండగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ,ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తున్నాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ కళ్యాణ్ రామ్ దయినప్పటికీ ఎన్టీఆర్ కూడా వాటా దక్కించుకుంటున్నాడట. అంతేకాకుండా భవిష్యత్తులో ఓ నిర్మాణ సంస్థను స్థాపించే ఆలోచనలో ఉన్న తారక్ ఇకపై తాను నటించే ప్రతి సినిమా నిర్మాణ భాగస్వామిగా ఉండాలని భావిస్తున్నాడట.