justice kurian joseph comments on nirbhaya case:
ఇప్పటికే మూడు సార్లు డెత్ వారెంట్లు జారీ అయినా వివిధ లిటీగేషన్ ల వలన తీర్పు అమలు కాలేదు. అయితే సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసఫ్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ ‘నిర్భయ’ కేసులో దోషులను ఉరి తీస్తే, అమానుష నేరాలు జరగకుండా ఆగిపోతాయా? అని ప్రశ్నించారు. గతంలో సుప్రీంకోర్టు ఓ కేసులో చెప్పిన విషయాలను ప్రస్తావించారు.ఇటువంటి నేరాలు చేసినవారిని శాశ్వతంగా జైలుకు పంపితే, ఎవరైనా ఇలాంటి నేరాలకు పాల్పడితే, వారిని శాశ్వతంగా కటకటాల వెనుకకు పంపిస్తారని సమాజానికి చెప్పవచ్చునన్నారు. ఉరి తీసినట్లయితే నేరం గురించి ప్రజలు మర్చిపోతారన్నారు. ఇక ‘‘ఈ నలుగురు దోషులను ఉరితీయడం ద్వారా ‘నిర్భయ’ తల్లిదండ్రులకు న్యాయం జరుగుతుందని నేను అనుకోను. బాధితురాలి తల్లిదండ్రుల పట్ల నాకు కచ్చితంగా సానుభూతి ఉంది. నేను నిజంగా బాధపడుతున్నా’’ అని చెప్పారు.
కాగా ఈ నెల 20న వీరికి తీహార్ జైలులో మరణ శిక్షలు అమలు కావలసి ఉండగా, తమకు విధించిన మరణ శిక్షల అమలును నిలిపేయాలని కోరుతూ ‘నిర్భయ’ కేసులో దోషులు దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు విచారణకు చేపట్టింది. డెత్ వారంట్ ప్రకారం ఆ జైలు అధికారులకు, పోలీసులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ గురువారం జరుగుతుందని తెలిపింది. రెండో క్షమాభిక్ష పిటిషన్, వివిధ లీగల్ అప్లికేషన్లు, అపీళ్ళు పెండింగ్‌లో ఉన్నందువల్ల తమకు విధించిన మరణ శిక్షల అమలును నిలిపేయాలని దోసులు ఢిల్లీ కోర్టును కోరారు.
డెత్ వారంట్ ప్రకారం ఈ నెల 20న ‘నిర్భయ’ దోషులు నలుగురికి తీహార్ జైలులో ఉరి శిక్ష అమలు కావలసి ఉంది. దోషి అక్షయ్ సింగ్ మంగళవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు రెండోసారి క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేశాడు. అదే రోజు పవన్ గుప్తా సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. నేరం జరిగిన సమయంలో తాను బాలుడినని పేర్కొంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. నేరం జరిగినపుడు తాను ఢిల్లీలో లేనని, తనకు విధించిన మరణ శిక్షను రద్దు చేయాలని కోరుతూ తాను దాఖలు చేసిన పిటిషన్‌ను ట్రయల్ కోర్టు తోసిపుచ్చడాన్ని సవాల్ చేస్తూ ముఖేష్ సింగ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది.