Kamal Nath denies being angry with Jyotiraditya Scindia:
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో తలెత్తిన సంక్షోభం తీవ్రమవుతోంది. ముఖ్యమంత్రి కమల్‌నాథ్ సారథ్యంలోని ప్రభుత్వానికి జ్యోతిరాదిత్య సింధియా విధేయులైన 20 మంది అసంతృప్త ఎమ్మెల్యేలు సవాల్ విసురుతున్నారు. సింధియా మద్దతుదారులైన మంత్రులతో సహా సుమారు 20 మంది ఎమ్మెల్యేలు ఎలాంటి సమాచారం లేకుండా సోమవారంనాడు బెంగళూరుకు తరలిపోవడంతో రాజకీయ సంక్షోభం ముదిరింది. వీళ్ళు రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారని విస్తృతంగా ప్రచారం కూడా జరుగుతోంది. ఫోనులో సైతం వారెవరూ అందుబాటులోకి రాకపోవడంతో కమల్‌నాథ్ వెంటనే రంగంలోకి దిగారు.
సోమవారం పొద్దుపోయిన తర్వాత సీనియర్ నేతలతో తన నివాసంలో అత్యవసర సమావేశం జరిపిన కమల్ నాధ్ సమావేశానంతరం ఆయన క్యాబినెట్‌లోని మంత్రులంతా రాజీనామాలు సమర్పించారు. ముఖ్యమంత్రి పట్ల వారు తమ విధేయతను ప్రకటిస్తూ, మంత్రివర్గ పునవ్వవస్థీకరణ చేపట్టాలని కమల్‌నాథ్‌ను కోరారు. ఇక జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ను వదిలేసి, బీజేపీలో చేరే ఆలోచనలో ఉన్నారన్న ప్రచారం కూడా నడుస్తోంది. ఆయనకు రాజ్యసభ సీటుతో పాటు, మోదీ ప్రభుత్వంలో మంత్రి పదవిని ఇచ్చేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రతిపాదన చేసినట్టు వార్తలొస్తున్నాయి.
సింధియా సోమవారంనాడు ఢిల్లీలోనే ఉన్నప్పటికీ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అపాయింట్మెంట్పై ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. కాగా, మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో సంక్షోభం కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారమని, దానిపై తాను వ్యాఖ్యానించేదేమీ లేదని మధ్యప్రదేశ్ మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ మంగళవారం మీడియాకు స్పష్టంచేసారు. ప్రభుత్వం కూలిపోతే అది ఆ పార్టీ స్వయంకృతమే అవుతుందన్నారు. కమల్‌నాథ్ సర్కార్‌ను కూల్చే ఆలోచన బీజేపీకి లేదనే విషయం మొదట్నించీ తాను చెబుతూనే ఉన్నానని ఆయన అన్నారు.