kanna Lakshminarayana Re counter to buggana Rajendranath reddy
ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాజీనామా సవాల్‌పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. కరోనా టెస్టింగ్ కిట్లను తాను సరఫరా చేసినట్లు చెప్పాడం పూర్తిగా అవాస్తవమని బుగ్గన పేర్కొంటూ తనకు కంపెనీ ఉండి.. దాని ద్వారా కిట్లను సరఫరా చేసినట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. కన్నా తనపై చేసిన ఆరోపణలు రుజువు చేస్తే శనివారం ఉదయం 9 గంటలకు రాజీనామా చేస్తానని.. లేదా కన్నా తన పదవికి రాజీనామా చేస్తారా? అని బుగ్గన ప్రశ్నించారు. కన్నా తన వయసుకు, బాధ్యతకు తగిన విధంగా మాట్లాడాలని సూచించారు.
ఈ నేపథ్యంలో కన్నా రియాక్ట్ అయ్యారు. ఓ ప్రకటన రిలీజ్ చేసారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా కరోనా కిట్ల విషయంలో జరిగిన అక్రమాలపై తాను రాష్ట్ర గవర్నర్‌కు గత నెల 27న లేఖ రాశానన్నారు. సవాల్ చేసే ముందు తాను రాసిన లేఖ పూర్తిగా చదివారా..? అని బుగ్గనను ఆయన ప్రశ్నించారు. లేఖ చదవకుండా పత్రికలలో వచ్చిన అంశాలను ప్రాతిపదికగా తీసుకుని మాట్లాడటం, సవాల్ చేయడం పూర్తిగా వారి విజ్ఞతకు వదిలివేస్తున్నామన్నారు. గవర్నర్‌కు రాసిన లేఖలోని అంశాలు ఒక సారి పరిశీలించాలని సూచించారు.
‘‘శాండర్ మెడిసిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ డైరెక్టర్లలో ఒకరు విశ్వనాధ వెంకట సుబ్రమణ్య ఆంజనేయ. ఈయన మెస్సర్స్ ఇన్వాసెంట్ అడ్వైజరీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో డైరెక్టర్‌గా ఉన్నారు. అదే సంస్థలో మంత్రి బుగ్గన సోదరుడు బుగ్గన హరిహరనాథ్ ఒక డైరెక్టర్‌గా ఉన్నారు. మంత్రి బుగ్గన సోదరుడు బుగ్గన హరిహరనాధ్, విశ్వనాధ వెంకట సుబ్రమణ్యం ఆంజనేయ ఒకే కంపెనీలో కో డైరెక్టర్లుగా ఉన్నారు. అలాంటి పరిస్థితిలో విశ్వనాధ వెంకట సుబ్రమణ్య ఆంజనేయ డైరెక్టర్‌గా ఉన్న సాండర్ మెడిసిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కరోనా టెస్టింగ్ కిట్స్ ఆర్డర్‌ను ప్రభుత్వం ఇచ్చింది. ఈ అంశాలు ప్రస్తావించకుండా సవాళ్లు విసరడం మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం’ అని కన్నా పేర్కొన్నారు.