KCR says do not demand rent and collect only tuition fees in schools
కరోనా కట్టడి కోసం లాక్డౌన్ అమలు చేస్తున్న సమయం లో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని ఈ కష్టకాలంలో ఇళ్ల యజమానులు అద్దె కోసం కిరాయిదారులను వేధించవద్దని తెలిపారు. మార్చి, ఏప్రిల్, మే నెలల ఇళ్ల అద్దెలు ఇప్పుడు వారిని అడగవద్దని సూచించారు. లాక్డౌన్ కారణంగా వారు ఇళ్లకు పరిమితి అయి ఉన్నందున ఆదాయం లేకుండా పోయిందని యజమానులు అర్థం చేసుకోవాలని, పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత విడతల వారీగా ఆ అద్దె మొత్తం వసూలు చేసుకోవాలని సూచించారు. అలాగని వాటిమీద వడ్డీ కూడా వసూలు చేయవద్దని ఒకవేళ అవి అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇది విజ్ఞప్తి కాదని ఆదేశం అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.ఇబ్బంది పెట్టే ఓనర్ల మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఎవరైనా అద్దె గురించి ఇబ్బంది పెడితే 100 కు డైల్ చేసి కంప్లయింట్ ఇవ్వోచ్చని తెలిపారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారలు ఉన్నాయని వివరించారు. అలాగే మున్సిపాలిటీలు, జీహెచ్ఎంసీ ట్యాక్స్‌లు చెల్లించే విషయంలోనూ సడలింపులు ఇచ్చారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా మే 31 వరకు పన్నులు చెల్లించుకోవచ్చని తెలిపారు. 2020-21 విద్యా సంవత్సరానికి ఫీజులు పెంచకూడదని ఆదేశించారు. రకరకాల ఫీజుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను వేధించవద్దని ట్యూషన్ ఫీజులు మాత్రమే వసూలు చేయాలని, అది కూడా ఓకే సారి కాకుండా నెల నెల చెల్లించే విధంగా ఉండాలని ఆదేశించారు.