Wednesday, January 19, 2022

Latest Posts

స్వ‌ర‌వాణి కీరవాణి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు

రాయినైనా కరిగించగల మ్యాజిక్ మ్యూజిక్‌కే సొంతం. అలాంటి మ్యూజిక్‌లో భాగ‌మైన‌ మెలోడీకి ఉండే ఇంపార్టెన్సే వేరు. ఏ తరంలోనైనా జన నీరాజనాలు దక్కేది ఎక్కువగా మెలోడీకే. ఓలలాడించే ఆ మెలోడీని తన జోడీగా చేసుకుని స్వరకర్తగా టాప్ రేంజ్‌కు చేరుకున్నారు స్వ‌ర‌వాణి ఎం.ఎం.కీరవాణి. ఆణిముత్యాల్లాంటి బాణీలతో మరకత మణి కీరవాణి మెలోడీ బాహుబ‌లిగా ఎదిగిన తీరు ప్రశంసనీయం.
తెలుగు సినీ పరిశ్రమలో పరిచయం అక్కర్లేని స్వరాల మధురవాణి ఎం.ఎం.కీరవాణి. ఓ రాగాన్నే పేరుగా పెట్టుకుని శ్రావ్యమైన సంగీతాన్ని, తెలుగు భాషలోని తియ్యదనాన్ని తన సంగీతం ద్వారా వినిపించగల దిట్ట ఆయన. ఎన్నో జనరంజకమైన గీతాలకు స్వరకర్తగా ప్రేక్షకుల హృదయాల్లో ఆయనది ప్రత్యేకస్థానం.

తెలుగు తెరపై ఎందరో స్వరకర్తలు తమ బాణీని చాటుకున్నారు. అయితే కొందరు మాత్రమే తెలుగు సినీ సంగీతాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. అలాంటి వారిలో కీరవాణి ఒకరు. న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేసే.. ఉషాకిరణ్ మూవీస్ సంస్థ ప్రొడ్యూస్ చేసిన మనసు మమతతో ఈ మధుర స్వరకర్త కెరీర్ ప్రారంభమైంది. తొలి నాళ్లలోనే సంగీత ప్రాధాన్యమున్న సినిమాల్లో వర్క్ చేసే అవకాశం రావడంతో తనను తాను ఫ్రూవ్ చేసుకునే అవకాశం దక్కింది కీరవాణికి. అలా వాణి బాణిని తెలుగువారికి ఘనంగా చాటిన చిత్రమే సీతారామయ్య గారి మనవరాలు. ఏఎన్నార్, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మ్యూజిక్ ఓరియెంటెడ్ మూవీ కావడం మరకత మణికి బాగా ప్లస్ అయ్యింది. అందులో ప్రతి పాటా ఓ ఆణిముత్యమే. ఆడియోతో పాటు సినిమా కూడా ఘనవిజయం సాధించడంతో కీరవాణి పేరు ఇంటింటా వినిపించడం మొదలైంది. సంగీత ప్రధాన చిత్రాలకు సంగీతం అందించి ఉద్దండులైన గత కాలపు సంగీత దర్శకులు లేని లోటును భర్తీ చేశారంటే అతిశయోక్తి కాదు.
పూసింది పూసింది పున్నాగ పూసంత నవ్వింది నీలాగ పాట పల్లవి అంతా వయొలిన్‌ వాయిద్యంతో సమానంగా సాగుతుంది.

జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా అంటూ సాగే ఈ పాట వినగానే అడవిలో చిమ్మచీకటి… కొన్ని రకాల పక్షుల ధ్వనులు… అమాయకమైన ముఖంతో భయపడే శ్రీదేవి, జోలపాడే వెంకటేష్‌ చప్పున మదిలో మెదులుతాయి. కొన్ని పాటలు ఫాస్ట్‌బీట్‌లో ఉన్నా వినడానికి చాలా బావుంటాయి. జానపద బాణీలో ఉన్న పాట ఎక్కడున్నా మనసుకు ఆకట్టుకుంటుంది. అటువంటి పాటే ఆపద్బాంధవుడు చిత్రంలోనీ ఔరా అమ్మకచల్లా ఆలకించి నమ్మడవెల్లా, అంత వింత గాథల్లో ఆనందలాలా. ఈ పాట మొదట్లో బారులు తీరిన పల్లె పడుచులు ఆలపించే జావళి పాటకు ప్రాణంగా నిలుస్తుంది. కీరవాణి అందించిన బాణీల్లో మెలొడీ, మాస్‌ పాటలే కాదు ఏడిపించే పాటలు కూడా ఉన్నాయి. వాటిలో మొదటి స్థానం మాత్రం రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే… తోటమాలిని తోడు వేడులే పాటదే. వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్యానికి కీరవాణి అందించిన బాణీ తోడై… ఎన్ని సార్లు విన్నా, ఎవరికైనా తెలియకుండానే కన్నీరొస్తుంది.

ఘరానా మొగుడు తరువాత అల్లరి మొగుడు, ప్రెసిడెంట్ గారి పెళ్లాం, సుందర కాండ, అబ్బాయిగారు, మిస్టర్ పెళ్లాం, రాజేశ్వరి కళ్యాణం, కొండపల్లిరాజా, వారసుడు, అల్లరి అల్లుడు వంటి చిత్రాలు విడుదలై కీరవాణి రేంజ్ ని పెంచితే.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రూపొందించిన అల్లరి ప్రియుడు జనాల జేజేలతో పాటు అవార్డులను సైతం తీసుకువచ్చింది. ఇందులోని ప్రతి పాటా నిత్యనూతనంగా ఉందంటే.. దానికి కీరవాణి స్వరాల పాత్ర ఎంతో ఉంది. తరువాతి కాలంలో అల్లరి ప్రేమికుడు, గాంఢీవం, బొబ్బిలి సింహం, క్రిమినల్, ముద్దుల ప్రియుడు, ఘరానా బుల్లోడు వంటి చిత్రాలతో సంగీత ప్రియులను అలరించారు కీరవాణి.

ఆ తర్వాత విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన శుభ సంకల్పం సినిమాకి క‌ల‌కాలం గుర్తుండిపోయే బాణీలు ఇచ్చిన కీరవాణి.. మిస్టర్ పెళ్లాం తరువాత బాపుతో రాంబంటు అనే సినిమా చేశారు. ఇక కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిన్న సినిమాగా రూపొంది.. పెద్ద విజయం అందుకున్న పెళ్లిసందడికి కీరవాణి చేసిన పాటల సందడి ఎలాంటిదో ప్ర‌త్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి పెళ్లిసందడి కీరవాణికి రివార్డులతో పలు అవార్డులను తెచ్చిపెట్టింది. పెళ్లి సందడి అనంతరం వచ్చిన సాహసవీరుడు సాగరకన్య, పవిత్ర బంధం, బొంబాయి ప్రియుడు వంటి సినిమాల కోసం గుర్తుండిపోయే ట్యూన్స్ నిచ్చిన కీరవాణికి తన స్వరప్రస్థానంలో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రంగా నిలిచింది అన్నమయ్య.

అన్నమయ్య తరువాత కొంత కాలం వరకు కీరవాణికి గుర్తుంచుకోదగ్గ హిట్ అయితే లభించలేదు. అలాగే ఆ టైంలో వచ్చిన శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి, సీతారామరాజు వంటి సినిమాలు చెప్పుకోదగ్గ విజయం సాధిస్తే.. పండగ, రాజహంస వంటి సినిమాలు ఫర్వాలేదనిపించుకున్నాయి. ఇలా బ్యాడ్ డేస్‌ను ఫేస్ చేస్తున్న టైంలోనే కీరవాణికి హ్యాపీడేస్‌ను తీసుకువచ్చిన సినిమా స్టూడెంట్ నెం.1. కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో.. కీరవాణి సోదరుడు ఎస్.ఎస్‌. రాజమౌళి దర్శకుడిగా అరంగేట్రం చేస్తూ రూపొందించిన ఈ సినిమాలోని పాటలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ చిత్రం తరువాత మళ్లీ కీరవాణి మార్క్ పాటల హవా పెరిగింది.

స్టూడెంట్ నెం.1 తరువాత లాహిరి లాహిరి లాహిరిలో, ఒకటో నెంబర్ కుర్రాడు, సీతయ్య, గంగోత్రి వంటి సినిమాలు మ్యూజికల్ హిట్స్‌ నిలిస్తే..సింహాద్రి సినిమా కీరవాణికి రాఘవేంద్రరావు కాలం నాటి డిమాండ్‌ను మరోసారి తీసుకువచ్చింది. ఈ పరంపరలోనే నేనున్నాను, నా ఆటోగ్రాఫ్, పల్లకిలో పెళ్లికూతురు, సై వంటి మ్యూజిక్‌కు స్కోప్ ఉన్న సినిమాలు కీరవాణి నుంచి వచ్చాయి. ఈ వరుసలోనే కీరవాణి ఇతర దర్శకులతో చేసిన సినిమాల్లో చాలా వరకు ఫ్లాప్ అయినా.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాద రామన్న, ఈగ వంటి చిత్రాలు.. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన శ్రీరామదాసు, పాండురంగడు, శిరిడి సాయి, ఝుమ్మంది నాదం, ఓం న‌మో వెంకటేశాయ‌ వంటి సినిమాలు ఆ మ్యూజిషన్ ప్ర‌తిభ‌ని చాటాయి. ఇక బాహుబలి సిరీస్‌తో అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు కీర‌వాణి. అంతేకాదు ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తో మళ్లీ మన ముందుకు రాబోతున్నాడు ఈ మరకతమణి.

200కి పైగా చిత్రాలకి సంగీతమందించిన కీరవాణి కేవలం సంగీత దర్శకుడుగానే పరిమితం కాలేదు. పాట డిమాండ్ చేసిన ప్రతిసారీ గాయకుడు అవతారమెత్తారు. గాయకుడుగా సరిపెట్టుకోకుండా.. సరదాగా లిరిక్స్ ని కూడా అందించే ప్రయత్నం చేసారు. అందమైన బాణిని ఇవ్వడమే కాకుండా.. దానికి మంచి సాహిత్యాన్ని కూడా రాబట్టుకోవడం అనే ఆర్ట్ ఏదైతే ఉందో అదే కీరవాణిలోని గీతరచయితని బయటకు తెచ్చి ఉంటుందన్నది ఆయన అభిమానుల మాట. ఇలా పాటకి సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్, సింగర్, రైటర్.. ఇలా అన్ని యాంగిల్స్ ని టచ్ చేసి పాట పట్ల తనకున్న మమకారాన్ని చాటుకున్నారు మరకతమణి కీరవాణి. బాణీల విషయంలో తనకంటూ ఓ మార్క్‌ను సృష్టించుకున్న కీరవాణి.. విజయాలు, అవార్డులు, ప్రత్యేకతలు.. అనే అంశాల్లోనూ తన మార్క్ ని చాటుకున్నారు. రానున్న రోజుల్లోనూ ఈ మెలోడీ బాహుబ‌లి మ‌రిన్ని విజయాలను, అవార్డులను అందుకోవాల‌ని ఆశిస్తూ మన 99 ఛానెల్ తరుపు నుంచి మరోసారి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss