Komatireddy Venkat reddy met with Narendra modi:
రాజకీయాలు ఎంత వేగంగా ఎలా మారతాయో చెప్పడం కష్టమే. తెలంగాణా రాజకీయం చూస్తే తెలంగాణ సీఎం కేసీఆర్ కి కళ్లెం వేయాలన్న ప్రయత్నం అన్ని పార్టీలు చేస్తున్నాయి. కానీ రోజురోజుకి కేసీఆర్ బలపడుతూనే ఉన్నారు. తాజాగా కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మరో అడుగు ముందుకేసి ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీని నేరుగా కల్సి పిర్యాదు చేసారు. కేసీఆర్ ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడని, లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి అవినీతి చేస్తున్నారని మోదీకి ఆయన ఫిర్యాదు చేశారు.
అయితే అంతటితో ఆగలేదు, మీడియా ముందుకొచ్చి మరో బాంబ్ పేల్చారు. తనకు అన్నీ తెలుసునని, అవినీతి వ్యవహారాలను సీరియ్‌సగా పరిగణించి చర్యలు తీసుకుంటామని ప్రధాని హామీ ఇచ్చారని కోమటిరెడ్డి చెప్పడం చర్చకు దారితీసింది. మంగళవారం ఆయన పార్లమెంటు భవనంలో ప్రధానిని కల్సిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణలో పరిస్థితులను, రాష్ట్రం ఎలా నాశనమైందో ప్రధానికి వివరించానని చెప్పారు.
తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కేసీఆర్ రూ.2 లక్షల కోట్ల అప్పులు చేశారని, కేంద్రం నుంచి లక్షా 75 వేల కోట్లు రుణం తీసుకొచ్చారని చెప్పానని తెలిపారు. ప్రాజెక్టుల పేరుతో రెండు మూడు కంపెనీలతో సిండికేట్ అయ్యి ఏ విధంగా దోచుకుంటున్నారో వివరించానని చెప్పారు. హైదరాబాద్ నుంచి ఫార్మా సిటీని గ్రామాల్లేని ప్రాంతానికి తరలించాలని, మూసీ నదిని ప్రక్షాళన చేయాలని ప్రధానికి విన్నవించినట్లు చెప్పారు. రైతుల నుంచి బలవంతంగా అతి చౌకగా భూములు సేకరించి వ్యాపారవేత్తలకు పెద్ద మొత్తానికి విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఫార్మా సిటీకి ఇచ్చిన అన్ని అనుమతులు నిలిపివేయాలని కోరానని తెలిపారు. .