krishnam raju wife shyamala devi participating corona services
కరోనా లాక్ డౌన్ తో అన్నార్తులను ,సేవకులను ఆదుకోవడంలో వదాన్యులు ,స్వచ్ఛంద సంస్థలు పోటీపడుతున్నాయి. సినిమా నటులు కూడా తమకు తోచిన రీతిలో సాయపడుతున్నారు. ఇక రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇంట్లో వాళ్ళు కూడా స్పందించారు. కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి వాస్తవానికి సామాజిక కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారు. అవేర్నెస్ కార్యక్రమాల్లో భాగంగా భర్తతో కలిసి తన వంతు ప్రయత్నం చేస్తుంటారు. ఇక పరిశ్రమలోనూ శ్యామలాదేవి తలలో నాలుక గా ఉంటారు.
చలన చిత్ర పరిశ్రమలో జరిగే సినిమా వేడుకలకు అప్పుడప్పుడు భర్తతో కలిసి శ్యామలాదేవి హజరవుతుంటారు. ఇటీవలే లాక్డౌన్ నేపథ్యంలో ఆపన్న హస్తంలో భాగంగా 4 లక్షలు విరాళంగా అందించారు. కాగా సోమవారం శ్యామలాదేవి పుట్టిన రోజు. ఈ సందర్భంగా శ్యామలాదేవి హైదరాబాద్ సిటీలో లాక్డౌన్లో సేవల్లో పాల్గొంటున్న పారిశుద్ధ్య కార్మికులకి, పోలీసు సిబ్బందికి, మీడియావారికి ఆమె స్వహస్తాలతో తయారు చేసిన పాయసాన్ని పంపిణీ చేసారు.
ఈ సందర్భంగా శ్యామలాదేవి మాట్లాడుతూ.. ‘‘ నా పుట్టిన రోజు సందర్భంగా కరోనా వైరస్ సమయంలో సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు..పోలీసు వారికి..మీడియా వారికి నా చేతులతో తయారు చేసిన పాయసాన్ని పంచాను. ఇదే నాకు నిజమైన పుట్టిన రోజు. ప్రాణాలకు తెగించి.. కుటుంబాలను వదిలేసి వీళ్లంతా ప్రజల కోసం ఎంతో సేవ చేస్తున్నారు. నా వంతుగా ఈ రోజు వాళ్లకి నా చేతులతో తయారు చేసిన పాయసాన్ని అందించాను’’ అని ఆనందం వ్యక్తంచేశారు.