Thursday, May 13, 2021

Latest Posts

తెరమీదికి మండలి రద్దు – వైసిపి ఎమ్మెల్యేల్లో గుబులూ

 రాజకీయాల్లో అన్నీ ఒకలాగా ఉండవు. అందునా హామీలకు అసలు విలువ ఉండదు. చూద్దాం చేద్దాం అంటే అన్నారంటే ఇక అంతేసంగతులు. ఇదంతా ఎందుకంటే , 2019 ఎన్నికల్లో అసెంబ్లీ టిక్కెట్లు ఇవ్వలేకపోయినా అనేక మందికి వైసీపీ అధినేత ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. ఈ జాబితాలో చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం టీడీపీ సభ్యుల మెజార్టీ ఉన్నా.. వచ్చే ఏడాది నుండి ప్రస్తుతం ఉన్న సభ్యుల పదవీ కాలం ముగియటం మొదలు కానుంది. ఖాళీ అయిన స్థానాల్లో ప్రస్తుతం అధికారంలో ఉండటంతో పాటుగా..అసెంబ్లీలో 151 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండటంతో వైసీపీ కి చెందిన వారే ఎమ్మెల్సీలు కానున్నారు. అయితే  ఇప్పుడు మండలి రద్దు చేస్తారన్న వార్తలు వైరల్ అవ్వడంతో  చాలామంది ఆశావహుల గొంతులో  పచ్చివెలక్కాయ పడినట్లయింది. అందునా మండలి రద్దు అనడం ఆవిధంగా  టీడీపీ కంటే వైసీపీ కే ఎక్కువ నష్టం అన్న వాదన వినిపిస్తుంది.నిజానికి   ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం ఇందుకు కారణం అవుతోంది.  మూడు రాజధానుల బిల్లులు శాసనసభలో ఆమోదం పొందిన తరువాత మండలిలో ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆ బిల్లుని మండలిలో టీడీపీ అడ్డుకోవడం ఖాయం.  అందుకే ఏకంగా   శాసన మండలి రద్దు అంశం అసెంబ్లీ లాబీలలో వినిపిస్తుంది. దీని పైన కొద్ది రోజులుగా చర్చ సాగుతున్నా..దాని వలన వైసీపీకే రాజకీయంగా నష్టం జరుగుతుందనే అంచనాతో ఆ ప్రతిపాదన పక్కన పెట్టేసారు.

   నిజానికి  శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రెండు బిల్లలను మండలి తిరస్కరించింది. ఇంగ్లీషు మీడియం స్కూళ్లు ఎస్సీ కమిషన్ బిల్లును వర్గీకరణకు సవరణ కోరుతూ తిరస్కరించింది. దీనితో ప్రభుత్వం ఈ రెండు బిల్లులను ఈ రోజు తిరిగి శాసనసభలో ప్రవేశ పెట్టి ఆమోదానికి ప్రయత్నిస్తోంది. ఇక ఇదే సమయంలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకం గా భావిస్తున్న మూడు రాజధానుల బిల్లు విషయంలో టీడీపీ మండలిలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. బిల్లులను మండలిలో ప్రవేశ పెట్టనీయకుండా ఉదయం నుండి రూల్ 71 కింద తీర్మానం పైన చర్చించాలని పట్టు బడుతోంది.

   దీంతో మండలిలో టీడీపీ సభ్యుల మెజార్టీ కారణంగా వైసీపీ నేతలు మండలి కొనసాగింపు పైన అసహనంతో ఉన్నారట.  మండలి రద్దు చేయటం అంత సులువైన అంశం కాదని..దీనికి పార్లమెంట్ ఆమోదం కావాలని..దాదాపు సంవత్సర కాలం సమయం పడుతుందని టీడీపీ సీనియర్ నేత యనమల అంటున్నారు. మండలి రద్దు చేస్తే వైసీపీలో చీలక వస్తుందని ఆయన  జోస్యం చెప్పారు. అయితే ప్రభుత్వం ఇప్పుడు బిల్లులు ఆమోదించుకొనేందుకే..వ్యూహాత్మకంగా ఈ ప్రచారం తెర మీదకు తీసుకొచ్చిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss