Maharashtra Governor asks EC to declare election schedule
ఏ సభలో సభ్యుడు కాకపోయినా ప్రధాన మంత్రి కావచ్చు,అలాగే ఏ రాష్ట్రానికైనా సీఎం కావచ్చు. అలాగే మంత్రులూ కావచ్చు ఆరుమాసాల్లోగా ఏదోక సభలో సభ్యునిగా ఎన్నికవ్వాలి. గతంలో పివి నరసింహారావు ఏ సభలోనూ సభ్యులు కాకున్నా పీఎం అయ్యారు. తర్వాత ఏపీలోని నంద్యాల నుంచి లోక సభకు పోటీచేసి భారీ మెజార్టీతో నెగ్గారు. గతంలో నందమూరి హరికృష్ణ రవాణా మంత్రిగా ఉంటూ,హిందూపురం నుంచి నెగ్గారు.
ఇదంతా ఎందుకంటే ఇప్పుడు మహారాష్ట్ర లో ఇదే సమస్య వచ్చింది. సీఎం ఉద్దవ్ ఠాక్రే ఏ సభలోనూ సభ్యుడు కాకుండా సీఎం అయ్యారు. ఆరుమాసాల్లో నెగ్గాల్సి ఉంది. శాసనమండలికి ఎన్నికలు వచ్చాయి. పోటీకి సిద్ధం అయ్యారు. కానీ కరోనా రావడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. దాంతో గవర్నర్ కోటాలో నామినేట్ చేయాలనీ ఇప్పటికే రెండు సార్లు కేబినెట్ తీర్మానించి గవర్నర్ కి పంపింది. ఈనేపధ్యంలో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారి స్పందించారు. లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఖాళీ అయిన 9 సీట్లకు ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ పంపారు.
కేంద్రం లాక్‌డౌన్‌ను అమలుచేస్తున్న నేపథ్యంలో కొన్ని సడలింపులిస్తూ మార్గదర్శకాలు జారీ చేసిందని, ఆ మార్గదర్శకాలకు లోబడి మహారాష్ట్రలో ఖాళీ అయిన లెజిస్లేటివ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని ఈసీని గవర్నర్ కోరారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే శాసనసభలో సభ్యుడు కాదని.. మే 27, లోపు ఆయన కౌన్సిల్‌కు ఎన్నిక కావాల్సి ఉందని గవర్నర్ ఈసీకి గుర్తుచేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ అంశంపై మహారాష్ట్ర గవర్నర్‌తో, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా సమావేశం కానున్నారు.