Mahesh Babu urge people to follow precautionary measures:
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ రోజురోజుకూ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సామాజిక దూరం పాటించడమే దీనికి సరైన మందని సూపర్‌స్టార్ మహేష్ బాబు చెబుతున్నాడు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ కూడా చేశాడు. మన సామాజిక జీవితాన్ని త్యాగం చేసి సమాజ భద్రతకు ప్రాముఖ్యం ఇవ్వాలని సూచించాడు.
`సామాజిక దూరం పాటించడం ఇప్పుడు చాలా అవసరం. ఇది చాలా కష్టమైన పని. కానీ తప్పదు. సామాజిక జీవితాన్ని త్యాగం చేసి సమాజ భద్రతకు ప్రాముఖ్యం ఇవ్వాలి. వీలైనంతవరకు ఇంట్లోనే ఉండి కుటుంబ సభ్యులతో గడపండి. మీ చేతులను తరచూ శుభ్రం చేసుకోండి. మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి. హ్యాండ్ శానిటైజర్స్‌ను వాడండి. ఆరోగ్యం బాగోలేకపోతే మాస్క్‌లను వాడండి. వైరస్ పూర్తిగా తొలగిపోయే వరకు ఈ జాగ్రత్తలు పాటిద్దామ`ని మహేష్ బాబు సూచించాడు.
ఇక దీంతో పాటు ఒక వీడియోను కూడా షేర్ చేశాడు. వరుసగా ఉన్న అగ్గిపుల్లలని కాలిపోతుండగా.. ఒక అగ్గిపుల్ల పక్కకు తప్పుకుంటుంది. అక్కడితో మంట ఆరిపోతుంది. మిగిలిన అగ్గిపుల్లలు కాలకుండా సురక్షితంగా ఉండిపోతాయి. ఈ పోస్ట్ కి విపరీతంగా స్పందన లభిస్తూ వైరల్ అవుతోంది.