Megastar chiranjeevi convey birthday wishes to chandrababu naidu
ఇది కరోనా వేళ.. ఈ సమయంలో పుట్టినరోజు వేడుకలు , శుభకార్యాలు అన్నీ నిరాడంబరంగానే జరుగుతున్నాయి. ఇక నేడు(ఏప్రిల్ 20 తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పుట్టినరోజు ). ఈ సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు. చంద్రబాబుకు తన ట్విట్టర్ ద్వారా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన శుభాంకాంక్షలు తెలిపారు. ‘‘అహర్నిశం ప్రజా సేవలో దశాబ్దాలుగా కొనసాగుతున్న మీ సంకల్పబలం అనితరసాధ్యం. కలకాలం మీకు సంతోషం, ఆరోగ్యం ప్రసాదించమని ఆ భగవంతుణ్ని కోరుతున్నాను. మీకు 70వ పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ దూరదృష్టి, కష్టించే తత్వం, మీ అంకిత భావం చాలా గొప్పవి’’ అని ఆయనతో ఉన్న ఫొటోను చిరంజీవి ట్వీట్ చేశారు.
కాగా చంద్రబాబు జన్మదినోత్సవం సందర్భంగా ఆయన తనయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేస్తూ తండ్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. పగలనక, రాత్రనక ప్రజల బాగుకోసం అవిశ్రాంతంగా పని చేసిన వ్యక్తిని చూస్తూ పెరిగానని అన్నారు. ప్రజాసేవ పట్ల ఆయనకున్న నిబద్ధత, అభిరుచి చెక్కుచెదరలేదని తెలిపారు. దూరదృష్టి గల నాయకత్వంతో తనకు, కోట్లాదిమంది తెలుగువారికి స్ఫూర్తినిస్తూనే ఉన్నారు’అనిలోకేశ్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
ఇక పలువురు నాయకులు ఫోన్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా కొన్ని ప్రాంతాల్లో కరోనా లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడేవారికి సేవా కార్యక్రమాలు చేసారు.