పాకిస్థాన్ స్టార్ బౌలర్ మహ్మద్ అమీర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పాకిస్థాన్ టీమ్ మేనేజ్మెంట్ టార్చర్‌ని నేను భరించలేక పోతున్నాని అందుకే వెంటనే ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు గురువారం ప్రకటించాడు. వన్డే, టీ20ల్లో ఆడేందుకు గత ఏడాది టెస్టులకి గుడ్ బై చెప్పిన ఈ 28 ఏళ్ల ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్‌ని.. డిసెంబరు 18 నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభంకాబోతున్న మూడు టీ20ల సిరీస్‌కి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఎంపిక చేయలేదు. దాంతో.. మనస్థాపానికి గురైన ఈ సీనియర్ ఫాస్ట్ బౌలర్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు.
2009లో ఇంటర్నేషనల్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన మహ్మద్ అమీర్.. ఏడాదిలోనే అత్యుత్తమ బౌలర్‌గా ఎదిగాడు. కానీ.. 2010లో ఇంగ్లాండ్ టూర్‌కి వెళ్లి అక్కడ మ్యాచ్ ఫిక్సింగ్‌కి పాల్పడిన అమీర్‌పై అప్పట్లో ఐదేళ్ల నిషేధం పడింది. దాంతో.. అతని కెరీర్ ముగిసిపోయిందని అంతా ఊహించారు. కానీ.. 2015-2016లో మళ్లీ పాక్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన మహ్మద్ అమీర్.. అగ్రశ్రేణి బౌలర్‌గా ఎదిగాడు. అయితే.. గత ఏడాది అనూహ్యంగా టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించడం ద్వారా పాకిస్థాన్ క్రికెట్ పెద్దలకి అతను కోపం తెప్పించాడు.
27 ఏళ్ల వయసులోనే టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించాల్సిన అవసరం ఏంటి..? పాక్ జట్టు భవిష్యత్ గురించి ఏమాత్రం ఆలోచించకుండా అతను స్వార్థంతో టెస్టులకి గుడ్ బై చెప్పినట్లు ఆ దేశ మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. ఇక అప్పటి నుంచి పీసీబీ నుంచి కూడా అతనికి మొండిచేయి ఎదురవుతూ వచ్చింది. న్యూజిలాండ్‌తో మూడు టీ20లు, రెండు టెస్టుల సిరీస్ కోసం ఏకంగా 35 మందితో టీమ్‌ని ఎంపిక చేసిన పాకిస్థాన్.. అందులో అమీర్‌కి చోటివ్వలేదు. దాంతో.. మనస్థాపానికి గురై ఆమిర్ క్రికెట్ కి వీడ్కోలు పలికాడు.