MP Kesineni nani shocking comments on Jagan:
స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ తీసుకున్న నిర్ణయంపై సీఎం జగన్ ఫైర్ అయిన సంగతి తెల్సిందే. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈనేపధ్యంలో విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని) ఓ ట్వీట్ చేస్తూ, ‘‘ఇది ప్రజాస్వామ్య దేశం జగనన్నా.. నియంతలా పాలిద్దామనుకుంటే కుదరదు. నువ్వు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన అన్నీ నువ్వు అనుకున్నట్లుగా జరగవు. ప్రతి దానికీ ఒక పద్ధతి ఉంటుంది’’ అని పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాలపాటు వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలతో కూడిన పేపర్ క్లిప్పింగ్నూ ఆయన ఆ ట్వీట్‌కు ట్యాగ్ చేశారు.
కాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో చోటు చేసుకున్న ఘర్షణలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ తప్పుబట్టారు. గుంటూరు, చిత్తూరులో జరిగిన అత్యంత హింసాత్మక ఘటనలు తమ దృష్టికి వచ్చాయని ఆయన తెలిపారు. గుంటూరు, చిత్తూరు కలెక్టర్లు, ఎస్పీలపై బదిలీ వేటుకు సిఫారసు చేశారు. తిరుపతి, మాచర్ల, పుంగనూరులో ఘర్షణలపై విచారణకు ఆదేశించారు.
ఆ మూడు చోట్ల కొత్త షెడ్యూల్‌కు వెనకాడబోమని హెచ్చరించారు. మహిళలు, బలహీనవర్గాలపై దాడులు అత్యంత శోచనీయమన్నారు. వలంటీర్లపై ఆరోణల విషయంలో కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రపంచ దేశాలను వణిస్తోన్న కరోనా.. తెలుగు రాష్ట్రాలకు కూడా ఈ వైరస్ పాకింది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను 6 వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెల్సిందే. ఇక రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణను అర్ధాంతరంగా వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ఈనెల 15న జారీచేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉదయం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయగా,దీన్ని విచారణ జాబితాలో చేర్చాలని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం రిజిస్ట్రీకి సూచించింది.