Namrata Shirodkar is learning new skills in lockdown period
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారితో దేశంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. దీంతో అందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఇక సెలబ్రెటీలు కూడా ఇంటికే పరిమితం అయిపోయారు. అనుకోకుండా వచ్చిన ఖాళీ సమయాన్ని చాలామంది సెలబ్రిటీలు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇంట్లో చేసే వంటల వీడియోలను, వర్క్ ఔట్ వీడియోలను, డాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటూ ఆనందంగా గడిపేస్తున్నారు. కొందరు సెలబ్రెటీలు ఇన్ని రోజులు తమలో దాగున్న టాలెంటు బయటపెడుతున్నారు. మరికొందరు కరోనా వల్ల కావాల్సినంత సమయం దొరకడంతో తమ ప్రతిభకు సాన పెడుతున్నారు. ఇక లాక్ డౌన్ వల్ల దొరికిన ఈ సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ కొత్త స్కిల్స్ నేర్చుకుంటోంది.
అవును, ఎప్పటి నుంచో నేర్చుకోవానుకుంటున్న స్టిచ్చింగ్ ,ఎంబ్రాయిడరీ స్కిల్స్ మీద నమ్రత సమయం వెచ్చిస్తోంది. ఇందుకోసం తన ఫ్రెండ్స్ తో కలిసి ఆన్ లైన్ క్లాసులలో జాయిన్ అయిందట. ఈ విషయం తెలిసిన వారు సూపర్ స్టార్ వైఫ్ అయ్యుండి ఇలాంటివి కూడా నేర్చుకుంటోందా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకున్న నమ్రతా శిరోద్కర్ ఒకప్పుడు టాప్ మోడల్. అయితే మహేశ్ తో చేసిన ‘వంశీ’ చిత్ర పరిచయంతోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి, పెళ్లికి దారితీసింది. పెళ్లి తర్వాత మోడలింగ్ నటనకు స్వస్తి పలికి ఇంట్లో ఇల్లాలిగా మారిపోయారు. భర్తా పిల్లల బాగోగులు చూసేందుకు సమయాన్ని కేటాయించింది. అంతేకాకుండా సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ అందరి మన్ననలు పొందుతోంది.
నమ్రత తన లైఫ్ లోకి వచ్చిన తర్వాత తనలో చాలా చేంజ్ వచ్చిందని మహేష్ అనేక సందర్భాల్లో చెప్తూనే వస్తున్నాడు. మహేష్ బాబుకి సంబంధించిన అన్ని విషయాల్లో నమ్రత జోక్యం చేసుకుంటూ భర్తకి అండగా నిలుస్తూ వస్తుంది. ఇప్పుడు మహేష్ బాబు అన్ని వ్యాపారాల్లో అడుగుపెట్టడానికి కూడా నమ్రతా నే కారణమని ఇండస్ట్రీలో అందరూ అంటుంటారు. సినీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకూ నమ్రత గురించి ఎలాంటి విమర్శలు వినపడలేదు. ఏ వివాదంలోనూ లేదు. పెళ్లి తర్వాత తన సినీ కెరీర్ కు గుడ్ బై చెప్పి పూర్తిగా కుటుంబ బాధ్యతలకే పరిమితమైన నమ్రత అంటే అందరికి గౌరవం ఎక్కువే. ఇక పేరుకి తగ్గట్టుగానే ఎంతో వినమ్రతతో ఉంటుందని ఇండస్ట్రీలో అందరూ చెప్తుంటారు