Narendra modi speaks about the coronavirus:
అత్యవసర సేవలు, వైద్య సిబ్బంది చేస్తున్న సేవలను కొనియాడుతూ దేశం మొత్తం ఏకతాటిపైకి రావడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ట్విటర్లో స్పందిస్తూ… ‘‘కరోనా వైరస్ మహమ్మారికి ఎదురొడ్డి పోరాడుతున్న ప్రతి ఒక్కరికీ దేశం యావత్తూ కృతజ్ఞతలు చెప్పింది. ఇందుకు దేశ ప్రజలకు కృతజ్ఞతలు. మీ హృదయాల నుంచి ఉప్పొంగిన కృతజ్ఞతా నాదం ఇది. అయితే మనం చేయాల్సిన సుదీర్ఘ యుద్ధంలో ఇది తొలి విజయం మాత్రమే. ఇదే దృఢ సంకల్పంతో మనల్ని మనం కట్టడి చేసుకుని సామాజిక దూరాన్ని పాటిద్దాం. సుదీర్ఘ యుద్ధం ముగిసే వరకు ఇదే నిగ్రహాన్ని పాటిద్దాం..’’ అని పిలుపునిచ్చారు.
కరోనా వైరస్‌కు ఎదురొడ్డి పోరాడుతున్న ప్రతి ఒక్కరికీ దేశం కృతజ్ఞతలు తెలిపిందని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఇవాళ సరిగ్గా 5 గంటలకు దేశం నలుమూలలా ప్రజలు ఇళ్ల నుంచి బయటికి వచ్చి హర్షనాదాలు చేయడం అభినందనీయమన్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా ఇళ్ల ముందు, బాల్కనీల్లో, మేడల పైనా ఎక్కడ స్థలం దొరికితే అక్కడ నిలబడి చప్పట్లు కొడుతూ సంఘీభావం తెలిపారు.
కాగా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ దేశం మొత్తం ఏకమైంది. అత్యవసర సేవలు, ఆరోగ్య సిబ్బంది సేవలను కొనియాడుతూ, వారికి మరింత ఉత్సాహం కలిగించేలా సరిగ్గా సాయంత్రం 5 గంటలకు ప్రజలంతా ఇళ్ల బయటికి వచ్చి చప్పట్లు కొడుతూ కృతజ్ఞత చాటుకున్నారు. కరతాళ ధ్వనులతో మాత్రమే కాదు… చిన్నా పెద్దా తేడా లేకుండా ఇళ్ల పైకి ఎక్కి ప్లేట్లు, డ్రమ్స్, గిటార్లు వాయిస్తూ సంఘీభావం తెలిపారు. సీఎం యోగి ఆదిత్యనాథ్, బాబా రాందేవ్, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సహా పలువురు ప్రముఖులు గంటను వాయిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.