జీవితం మసిపూసిన వదనం
జీవితం అఖండ భయసదనం
జీవితం గాలి వీచని సాయంత్రం.. అంటూ ఓ కవి రాసిన మాటలు ఇవి. మనిషి పుట్టుక నుండి మరణం దాకా సాగే ప్రయాణమే జీవితం. అది చూడగలిగితే ప్రతి జీవితం ఓ అద్భుతమే.. చదవగలిగితే ప్రతి జీవితమూ ఓ చరిత్రే అవుతుంది అన్నాడు మరో కవి.
రావణ, దుర్యోధన, నరకాసుర, కీచక, దక్ష, మహోదర, భస్మాసుర, బాణాసుర, కంస, హిరణ్యాది రాక్షస పాత్రలకు రాజసాన్ని కట్టబెట్టిన అభినయ వైతాళికుడు ఎస్వీఆర్. అంతేకాదు అన్నా, నాన్న, తాత, తండ్రి, బాబాయ్, గురువు, ఊరి పెద్ద వంటి పెద్ద మనసున్న పెద్దరికపు పాత్రలలో ఎస్.వి.ఆర్. కురిపించిన కరుణరసాత్మక కారుణ్య ధారలలో తడిసి ముద్దలై ,ముగ్దులై పోయారు తెలుగు, తమిళ రాష్ట్రాల సినీ ప్రియులు. ఆనాటి తెలుగు తమిళ చిత్ర రంగాల అగ్ర కథానాయకులు, దర్శక నిర్మాతలు ఎస్వీ రంగారావు డేట్స్ కోసం పడిగాపులు పడిన సందర్భాలు ఎన్నో. ఎస్ వి రంగారావు అంటే ఎక్కడ అంటూ అసిస్టెంట్ డైరెక్టర్స్, ప్రొడక్షన్ మేనేజర్లు ఎక్కడా ఎక్కడా అని పరుగులు పెట్టిన వారే ఎక్కువ. అంత క్రేజ్ ఇది అప్పట్లో ఎస్ వి రంగారావు గారికి. మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నా అదే ఆచార్య ఆత్రేయ గారి మీద ఒక నిందా పూర్వక స్తుతి ఉండేది. అదే ఆయన రాయక నిర్మాతలను రాసి ప్రేక్షకులను ఏడిపిస్తాడు అన్నది. అలాగే ఎస్ వి రంగారావు మీద ఉన్నది కూడా అలాంటి నిందే ఉండేది. తన బలమైన బలహీనత తాగుడు. దాని కారణంగా సమయానికి షూటింగుకు రాకుండా నిర్మాతలను… వచ్చాక తన మంత్ర ముగ్ద అభినయ చాతుర్యంతో ప్రేక్షకులను ఏడిపించే వారు ఎస్వీ రంగారావు గారు. అలాంటి మహోన్నత వ్యక్తి పుట్టిన రోజు మీరు ఈ సందర్భంగా మనమందరం ఆయనను ఒకసారి స్మరించుకుందాం.
సుప్రసిద్ధ తెలుగు సినీ నటుడు ఎస్వీ రంగారావు పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. కృష్ణా జిల్లాలోని నూజివీడులో 1918 జూలై 3వ తేదీన లక్ష్మీ నరసాయమ్మ, కోటేశ్వరరావులకు దంపతులకు జన్మించాడు. తండ్రి ఎక్సైజు శాఖలో పని చేసేవాడు. యస్.వి.రంగారావు హిందూ కాలేజిలో చదివాడు. డిగ్రీ వరకూ చదివి, అగ్నిమాపక దళంలో ఉన్నతోద్యోగిగా పనిచేస్తూ.. షేక్స్పియర్ ఆంగ్ల నాటకాలలో ఒథెల్లో, షైలాక్ తదితర పాత్రలు పోషించి ప్రముఖ రంగ స్థల కళాకారుడిగా విశేష ఖ్యాతి గడించాడు. ఆ తర్వాత బి.వి.రామానందం దర్శకత్వంలో నిర్మించిన వరూధిని చిత్రంలో ప్రవరాఖ్యుడిగా తెలుగు చలనచిత్ర రంగానికి పరిచయమయ్యాడు. నట యశస్విగా పేరు పొందిన ఈ నటుడు మూడు దశాబ్దాలపాటు మూడొందల చిత్రాలకు పైగా అద్భుతంగా నటించి ఘటోత్కచుడిగా, కీచకుడిగా, రావణాసురుడిగా తనకు తానే సాటిగా ఖ్యాతి గడించాడు. ఆయా పాత్రలలో ఆయన ఎంత మమేకమై పోయారంటే, వేరెవరు కూడా ఆ పాత్రలలో ఇప్పటివరకు ఇమడలేకపోయారు.
సినిమాల్లో నవరసాలు అత్యద్భుతంగా పండించిన ఎస్.వి.రంగారావు చలనచిత్ర రంగ ప్రవేశం అంత సజావుగా సాగలేదు. పాతాళభైరవి సినిమా విడుదలయ్యేదాకా రంగారావు సినిమారంగంలో నిలదొక్కుకునేందుకు చాలా కష్టపడ్డారు. నటన మీద మోజుతో చేతికందిన ఉద్యోగాలు కూడా వదులుకున్నారు. తొలిరోజుల్లో రంగారావు నటజీవితం వడ్డించిన విస్తరి కాదు. దాదాపు 300 చిత్రాలకు పైగా నటించిన వాటిలో జానపదాలు, పౌరాణికాలు, చారిత్రాత్మకాలు, సాంఘికాలు వున్నాయి. కుటుంబకథా చిత్రాలే కాదు, డిటెక్టివ్ చిత్రాల్లో కూడా రాణించిన రంగారావు తొలి సినిమాలో నటించడానికి అనేక ఇబ్బందులు, ఆటుపోట్లతోబాటు అవమానాలు కూడా ఎదుర్కొన్నారు. ఆ నటసార్వభౌముడు తదనంతరకాలంలో పాత్రలను మించి ఎదిగి నటించారు. రౌద్రం, వీరం, అద్భుతం, కరుణ రసాలను అలవోకగా పండించి అందరితో ఆహా అనిపించుకున్నారు. ఆ విశ్వ నటచక్రవర్తి మనకు భౌతికంగా దూరమైనప్పటికీ ఆయన అసమాన నటనతో జీవం పోసుకున్న 260 పైగా అద్భుత పాత్రలు మన జ్ఞాపకాల నిధులుగా నిలిచిపోయాయి.
ఇది కూడా చదవండి: