Netizens appreciate to vedanta group chairman Anil Agarwal:
ప్రస్తుతం కరోనా మహమ్మారి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అగ్ర రాజ్యాలు,అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా అల్లలాడిపోతున్నాయి. ఆదివారం జనతా కర్ఫ్యుకి ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపు మేరకు జనాలు స్వచ్ఛందంగా ఇళ్ల దగ్గరే ఉండిపోయారు. అన్ని నగరాలూ,గ్రామాలూ కూడా జనం రోడ్లమీద లేకపోవడంతో వెలవెలబోయాయి. ఇక ఈ మహమ్మారిని అరికట్టడానికి తమవంతు విరాళాన్ని ప్రకటించి, వేదాంత గ్రూప్స్ చైర్మన్ అనిల్ అగర్వాల్ ఉదాత్త మనసును చాటుకున్నారు.
దేశంలో కరోనా వైరస్‌తో పోరాడడానికి వంద కోట్ల భారీ విరాళాన్ని అనిల్ అగర్వాల్ ఆదివారం ప్రకటించారు. దేశానికి అత్యవసరమైన అవసరం ఉన్నప్పుడు ఈ నిధి ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ రోజువారీ కూలీలకు, ఇబ్బందులు ఎదుర్కొనే వారికి నా శక్త్యానుసారం సహాయం చేస్తున్నానని ప్రకటించారు.
‘‘ఈ మహమ్మారిని ఎదుర్కోడానికి వంద కోట్లు ప్రకటిస్తున్నా. దేశానికి ప్రస్తుతం మన నిర్ణయాలు అత్యంత కీలకం. చాలా మంది ప్రజలు అయోమయంలో ఉన్నారు. ముఖ్యంగా రోజువారీ కూలీల విషయంలో చాలా ఆందోళన చెందుతున్నా. మా సాధ్యమైనంత సాయం వారికి చేస్తాం’’ అని అనిల్ అగర్వాల్ ప్రకటించారు. దీంతో అనిల్ అగర్వాల్ ని నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు.