North Korea President Kim Jong-Un made first public appearance
బ్రెయిన్ డెడ్ అని, ఆరోగ్య సమస్యల కారణంగా కిమ్ మరణించారని ఇలా రకరకాల కథనాలతో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఆచూకీపై గతం కొంత కాలంగా వస్తున్న వదంతులకు ఫుల్ స్టాప్ పడింది. నిజానికి ఏప్రిల్ 12న చివరిసారిగా కిమ్ ప్రజల ముందుకు వచ్చారు. ఆ తరువాత జరిగిన తన తాత జయంత్యుత్సవాల వేడుకల్లోను, మిలిటరీ దినోవత్సవంలోనూ ఆయన కనబడకపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా కలకలం చెలరేగింది. ఆయన ఆరోగ్యం క్షీణించిందనీ, విషమపరిస్థితిని ఎదుర్కొంటున్నారనే వార్తలకు తోడు.. కిమ్ మరణించి ఉండొచ్చనే వార్తలకు కూడా గుప్పుమన్నాయి. కిమ్ తరువాత ఉత్తరకొరియా ఎవరి చేతుల్లోకి వెళ్లనుందీ అనే ప్రశ్నలపై ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ కూడా తెరలేచింది.
ఆ సమయంలో ఆయన చెల్లెలి పేరు తెరపైకి వచ్చింది. అయితే కిమ్ క్షేమంగానే ఉన్నారంటూ దక్షిణ కొరియా తొలి నుంచీ చెబుతూ వచ్చింది. తాజాగా ఆయన ప్రజల ముందుకు రావడంతో ఇంతకాలం చెలరేగిన ఉత్కఠంకు తెరపడినట్టైంది. మొత్తానికి 20 రోజుల తరువాత తొలిసారిగా ప్రజల ముందుకు వచ్చారు. రాజధాని పోంగ్యాంగ్కు సమీపంలోని సుంచోన్ ప్రాంతంలో ఓ ఎరువుల తయారీ కర్మాగారాన్ని ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించినట్టు ఆ దేశ జాతీయ మీడియాలో ఫోటోలతో సహా వార్తలు రావడంతో క్లారిటీ వచ్చింది.
ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సంధర్భంగా కిమ్.. కర్మాగారం పరిసరాల్లో కలియతిరుగుతూ ఎరువుల ఉత్పత్తి అయ్యే తీరును పరీశీలించారని, ఆయన రిబ్బన్ కట్ చేసి ఫ్యాక్టరీని ప్రారంభించగానే అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున చప్పట్లు చరస్తూ కిమ్ మద్దతు తెలిపారని, ఆ ప్రాంతంలో ఆనందం వెల్లివిరిసిందని మీడియా వెల్లడించింది. ఈ సందర్భంగా కిమ్ భావోద్వేగానికి గురవుతూ, ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం గురించి తన తాతకు తెలిస్తే ఎంతో సంతోషించేవారని వ్యాఖ్యానించారట. కిమ్‌తో పాటూ ఆయన చెల్లెలు, విశ్వనీయ సలహాదారు అయిన కిమ్ యో జాంగ్ కూడా ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. మరి ఇన్నాళ్లూ కిమ్ మీడియాకు ఎందుకు దూరంగా ఉన్నారో తేలాల్సి ఉంది.