పలాస 1978 కథ:
80 దశకంలో పలాసలో అగ్రవర్ణాల కుటుంబాలకు, నిమ్న వర్గాల మధ్య అసమానతలు తీవ్రంగా నెలకొని ఉంటాయి. నీళ్లు తాకితే మైల పడిపోతుందని చిన్న కులాల వారిపై దారుణంగా దాడులకు పాల్పడుతుంటారు. అలాంటి క్రమంలో పాటలు పాడుకుంటూ జీవనం సాగించే గ్రామ యువకులు మోహన్ రావు (రక్షిత్), రంగారావు (తిరువీర్) గొంతు లెవనెత్తుతారు. దాంతో అగ్రవర్ణాలకు, వెలివేయబడిన కులాలకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. గ్రామంలో ఫ్యాక్షన్ రెచ్చగొట్టే పెద్ద షావుకారు, చిన షావుకారు గురుమూర్తి (రఘు కుంచె) అన్యాయాలను ఎదురించడం మొదలుపెడుతారు.
పలాస 1978 కథలో ట్విస్టులు:
కళాకారులైన మోహన్ రావు, రంగారావు రౌడీలుగా ఎందుకు మారాల్సి వచ్చింది? పెద్ద షావుకారుకు, చిన్న షావుకారు మధ్య విభేదాలు ఏ మేరకు ఊరిలో చిచ్చుపెట్టాయి? పెద్ద షావుకారును చంపడానికి ఎలాంటి సంఘటనలు కారణమయ్యాయి? చిన్న షావుకారును ఇద్దరు యువకులు ఎలా ఎదురించారు? ఫ్యాక్షన్‌ను అంతం చేయడానికి ప్రయత్నించిన పోలీస్ ఆఫీసర్ సెబాస్టియన్ (విజయ్ రామ్) పరిస్థితి చివరు ఏమైంది? అగ్రకులాలను ఎదురించే క్రమంలో మోహన్ రావు, రంగారావు ఎలాంటి త్యాగాలకు పాల్పడాల్సి వచ్చిందనే పలు ప్రశ్నలకు సమాధానమే పలాస 1978.
ఇక పలాస 1978 మూవీకి వెన్నెముకగా నిలిచింది మోహన్ రావు పాత్ర. ఈ పాత్రలో రక్షిత్ పరకాయ ప్రవేశం చేశాడా? అనే ఫీలింగ్ కలుగుతుంది. పలు షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌ను మంచి నీళ్లు తాగినంత తేలికగా చేసేశాడు. హావభావాలు పలికించంలోను, డైలాగ్స్ చెప్పడంలోను, ప్రేమ సీన్లను పండించడంలోను ఆల్ రౌండ్ ప్రతిభను చాటుకొన్నాడు. ఆ తర్వాత రంగారావు పాత్రను తిరువీర్ కూడా అద్బుతంగా పోషించాడు. ఆవేశం కలిగిన యువకుడిగా రక్షిత్‌తో పోటాపోటీగా నటించి మెప్పించాడు. నక్షత్ర పాత్ర కూడా సినిమాకు అదనపు ఆకర్షణగా మారింది, ఆమె అందంతోపాటు, అభినయంతో ఆకట్టుకొన్నారు.
ఫైనల్‌గా:
గ్రామ రాజకీయాలు, సమాజంలోని కుల వివక్ష, అగ్రవర్ణాల దాడులు తదితర అంశాలను ఆధారంగా చేసుకొని సంధించిన సినీ విమర్శనాస్త్రం పలాస 1978. సినిమాకు సాంకేతిక విభాగాల పనితీరు, నటీనటుల ఫెర్ఫార్మెన్స్ ప్రధాన బలం. ఆలోచింప జేసే డైలాగ్స్, కథనం సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. సమాజిక అంశాలు అద్దిన ఆర్ట్ సినిమాగా అనిపించినా.. కమర్షియల్ పుష్కలంగానే ఉన్నాయి. బీ, సీ సెంటర్లతోపాటు మల్టీప్లెక్స్ ప్రేక్షకుల ఆదరణకు లభిస్తే కమర్షియల్‌గా మరో రేంజ్‌కు వెళ్లడం ఖాయం.
మూవీ రేటింగ్: 3.0/5