pawan kalyan comments on kanna laxminarayana ,vijayasai reddy issue
ఆంధ్రప్రదేశ్ లో ఓ పక్క కరోనా విజృంభిస్తుంటే,మరోపక్క రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం వ్యక్తిగత దూషణలు సాగిపోతున్నాయి. ముఖ్యంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ,వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి ల మధ్య సాగుతున్న మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ,బుధవారం ఓ ప్రకటన విడుదల చేసారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా నివారణపై కంటే రాజకీయ ప్రత్యర్థులపైనే కొందరు అధికార పార్టీ పెద్దలు దృష్టి పెడుతున్నారని పవన్ వ్యాఖ్యానించారు.
ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్‌ను సైతం విడిచిపెట్టలేదని,ముఖ్యంగా గుంటూరు, కర్నూలు, కృష్ణా జిల్లాల ప్రజలు పెరుగుతున్న పాజిటివ్ కేసులు చూసి బెంబేలెత్తిపోతున్నారని ఆయన గుర్తుచేశారు. ఇటువంటి విపత్కర పరిస్థితిలో ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో తప్పులు వేలెత్తి చూపేవారిపై బురద చల్లే కార్యక్రమాన్ని అధికార పార్టీ పెద్దలు కొనసాగిస్తున్నారని పవన్ విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణపై జరుగుతున్న వ్యక్తిగత విమర్శలు ఇందులో భాగంగానే కనిపిస్తున్నా యని ఆయన వ్యాఖ్యా నించారు.
కన్నాపై జరుగుతున్న వ్యక్తిత్వహనన దాడి ని ప్రజాస్వామ్యవాదులు ఖండించవలసిన రీతిలో, ఆయనకు క్షమాపణలు చెప్పాలని అడిగే స్థాయిలో ఉందని పవన్ వ్యాఖ్యానించారు. ‘‘కరోనా మహమ్మారి రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని వదిలిపెట్టిపోయేంత వరకూ రాజకీయాలను పక్కన పెడదాం… చిల్లర రాజకీయాలకు దూరంగా ఉందాం.. ప్రజలను రక్షించుకోవడం, వారి సంక్షేమం, అవసరాలు, ఆకలిదప్పులు తీర్చడంపై మన శక్తియుక్తుల్ని కేంద్రీకరిద్దాం..ఇప్పటివరకు అయినది చాలు. ఈ సమయంలోనైనా రాజకీయాలు ఆపకపోతే ప్రజలు తిరగబడే పరిస్థితులు ఏర్పడే ప్రమాదం వుంది’’ అని పవన్ కళ్యాణ్ ఘాటుగానే ఆ ప్రెస్ నోట్ పేర్కొన్నారు.