Pawan kalyan described it as an unforeseen disaster in india
రాజకీయాల్లో జోరుగా ఉంటూనే సినిమాల్లోనూ తన స్టామినా చూపించాలని టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇచ్చిన జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా స్పందిస్తున్నాడు. కరోనా లాక్ డౌన్ తో సినిమాలు ఆపేసి ఇంటికి పరిమితం అయిన పవన్ పార్టీ శ్రేణులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ మోనటరింగ్ చేస్తున్నాడు. ఇందులో భాగంగా గుంటూరు, కృష్ణా జిల్లాల నేతలతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించాడు.
కరోనాపై ప్రభుత్వం పని తీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన సాయం చేయడమే ముఖ్యమని, అందుకే సంయమనంతో సున్నితంగా స్పందిస్తున్నామని పవన్ చెప్పుకొచ్చారు. కరోనా వల్ల కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటిని ప్రభుత్వానికి తెలియచేస్తామని పవన్ అన్నారు. చిన్న కుటుంబాల నుంచి వచ్చినవారు సైతం పెద్ద మనసుతో సాటివారిని ఆదుకుంటున్న వారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నట్లు పవన్ పేర్కొన్నారు.
కార్మికులు, కర్షకులు, క్వారంటైన్ కేంద్రాలలో ఇబ్బందులను అధినేత పవన్ కల్యాణ్ కు జనసేన నాయకులు వివరించారు. మన జీవితంలో ఎన్నడూ ఊహించని విపత్తుని ఎదుర్కొంటున్నమని, ఈ కష్ట సమయంలో ప్రజలకు అండగా నిలిచి, మనో ధైర్యాన్ని ఇవ్వాలనే బాధ్యతతో జనసేన నాయకులు, కార్యకర్తలు పని చేస్తున్నారని పవన్ చెప్పారు. కాగా ఇలాంటి విపత్తు వేళ చిల్లర రాజకీయాలు చేయడం తగదని ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే.