జన సేన చీఫ్ పవన్ కల్యాణ్ ప్రస్తుత దుర్ఘటన పై స్పందించారు. ” కాలుష్య నియంత్రణ మండలి కఠినంగా వ్యవహరించాలి విశాఖపట్నం పరిధిలోని ఆర్.ఆర్.వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి విష వాయువులు విడుదలై అయిదు కిలోమీటర్ల మేర ప్రజల భయకంపితులు కావడం, 8 మంది మృతి చెందటం… వందల మంది తీవ్ర అస్వస్థతకు లోనవడం హృదయవిదారకం. మృతుల కుటుంబాలకు నా తరఫున, జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. అస్వస్థతకు గురైనవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. వారికి ప్రభుత్వం మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలి. మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందించాలి.
విశాఖ పరిధిలోని పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి. ప్రభుత్వం తక్షణం పరిశ్రమల్లోని రక్షణ, కాలుష్య నియంత్రణ చర్యలను పరిశీలించాలి. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఇలాంటి పరిశ్రమల విషయంలో నిర్లిప్తంగా ఉండకుండా ప్రజారోగ్యం పట్ల, పర్యావరణ పరిరక్షణపట్ల బాధ్యతగా ఉండాలి. కఠినంగా వ్యవహరించాలి. ఈ ప్రమాదం గురించి, విశాఖ పరిధిలోని కాలుష్యకారక పరిశ్రమల గురించి నివేదిక సిద్ధం చేయాలని మా పార్టీ నాయకులకు సూచించాను.” స్పష్టం చేశారు.