Ramadan, the most sacred month for Muslims, begins in three days
ముస్లీంల అతి పవిత్ర మాసం అయిన రంజాన్ నెల మూడు రోజుల్లో ప్రారంభమవుతోంది. ప్రతీ ఏటా రంజాన్ మాసం మొదలైతే ముస్లీంలతో పాటు హైదరాబాద్ వాసులంతా హలీమ్ కోసం ఎగబడతారు. నగరవాసులకే కాదు హైదరాబాద్ ను ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ చేసిన ఫుడ్ ఐటమ్స్ లో హలీమ్ ఒకటి. చికెన్, మటన్, వెజ్ హలీమ్‌లను లొట్టలేసుకుంటూ తింటుంటారు. రంజాన్ మాసంలో మాత్రమే దొరికే హలీమ్ ను ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు.
అలాగే చాలామంది హలీం ప్రియులు రంజాన్ మాసం ఎప్పుడొస్తుందా ఎప్పుడు హలీం తిందామా అని చుస్తుంటారు కానీ తాజాగా హలీమ్ మేకర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో ఎక్కడా కూడా హలీమ్ తయారీ చేయడం లేదని తెలిపింది. కరోన వ్యాప్తి దృష్ట్యా ప్రార్థనలు, పండగలు ఇళ్లకే పరిమితం కావాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అందుకని మసీదుల్లో కూడా సామూహిక ప్రార్థనలకు అనుమతి లేదని తేల్చేసింది. కేవలం ఇమామ్, మౌజన్లకు మాత్రమే మసీదుల్లో నమాజులు చేసుకోవచ్చని సూచించింది. లాక్ డౌన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు ఉండవని అసోసియేషన్ కూడా స్పష్టం చేసింది. ఈ ఏడాది రంజాన్ ప్రత్యేక వంటకం హలీమ్ ఎక్కడ తయారు చేయడం లేదని అసోసియేషన్ సభ్యుడు ఎంఏ మజీద్ పేర్కొన్నారు.