Reasons behind the congress crisis:
ఒకప్పుడు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఏలుబడి సాగిస్తూ,కేంద్రంలో ఎక్కువకాలం అధికారాన్ని హస్తగతం చేసుకున్న సుదీర్ఘ చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అనేక సమస్యలతో సతమతమవుతోంది. కొన్ని రాష్ట్రాల్లో నెగ్గినా నిలబెట్టుకోలేకపోతోంది. నాయకుల్లో విశ్వాసాన్ని నింపలేక పోతోంది. ఈ నేపథ్యంలో పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసారు.
ప్రస్తుతం కాంగ్రెస్ ఎదుర్కొంటున్న సంక్షోభానికి యువనేత రాహుల్ గాంధీ పగ్గాలు చేపట్టడమే ఏకైక పరిష్కారంగా అభిప్రాయపడ్డారు. ఆయన పగ్గాలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ ఒకే ఒక్కసారి ఓటమి చెందిందని, దీనికే ఆయన పగ్గాలు విడిచిపెట్టడం ఏమాత్రం బాగోలేదన్నారు. ఇంత వయస్సులో కూడా సోనియా గాంధీని ఇబ్బందిపెట్టడం ఏమాత్రం సరైన విధానం కాదని ఆయన స్పష్టం చేశారు.
‘‘సోనియా గాంధీ సమర్థవంతమైన నాయకురాలే. కానీ ఆమె వయస్సు పైబడుతోంది’’ అని అమరీందర్ సింగ్ వ్యాఖ్యానించారు. రాహుల్ పార్టీ పగ్గాలు విడిచిపెట్టిన తర్వాత నాయకులందరూ ఒత్తిడి చేయడంతో ఆమె పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ చాలా సున్నితమైన నాయకుడు కానీ, చాలా గట్టివారని అభిప్రాయపడ్డారు. అయితే తాను మాత్రం పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనని, పంజాబ్‌ను విడిచి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.