Home బిజినెస్ కరోనా ఎఫెక్ట్ :దక్షిణ మధ్య రైల్వేకు రూ 429కోట్ల నష్టం

కరోనా ఎఫెక్ట్ :దక్షిణ మధ్య రైల్వేకు రూ 429కోట్ల నష్టం

Rs 429 crore loss to South Central Railway due to corona effect

Rs 429 crore loss to South Central Railway due to corona effect

కరోనా మహమ్మారి అన్ని రంగాలను దెబ్బతీసింది. అందునా రైల్వే శాఖకు తీరని నష్టం మిగిల్చింది. ముఖ్యంగా ఆదాయ వనరులు సమకూర్చే  దక్షిణ మధ్య రైల్వే కకావికలం అయింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలను తక్కువ ధర, తక్కువ సమయంలో మెయిల్‌, సూపర్‌ఫాస్ట్‌ రైళ్ల ద్వారా వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేరవేస్తూ రవాణా రంగంలో తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్న దక్షిణ మధ్య రైల్వే కొవిడ్‌-19 దెబ్బతో ఒక్కసారిగా కుదేలైపోయింది. నాడు వేలాది మంది ప్రయాణికులతో కళకళలాడిన రైల్వేస్టేషన్లు కరోనాకాటుతో కళావిహీనంగా మారాయి. ఆయా వ్యాపారాలతో కుటుంబాలను పోషించుకున్న చిరు వ్యాపారులు ఉపాధి కరువై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లాక్‌డౌన్‌ ఎత్తేస్తే స్టేషన్లలో వ్యాపారాలు ప్రారంభించాలని కొందరు.. కరోనాతో నగరంలో చిక్కుకుపోయిన మరికొందరు సొంతింటికి వెళ్లేందుకు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

దేశంలో బ్రిటీషు కాలంలో 1853 ఏప్రిల్‌ 16న భారతీయ రైల్వే తన కార్యకలాపాలను ప్రారంభించింది. అయితే 167 ఏళ్ల కాలంలో ఒకేసారి దాదాపు నెల రోజులకుపైగా రైళ్ల రాకపోకలను బంద్‌ చేసిన చరిత్ర ఎన్నడూ కనిపించలేదు. లాక్‌డౌన్‌ మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 17 వరకు (33 రోజుల్లో) దక్షిణ మధ్య రైల్వేకు రూ.429 కోట్ల నష్టం వాటిల్లిందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. లాక్‌డౌన్‌ తొలగిన తర్వాత ఆరునెలల వరకు కూడా ఆదాయాన్ని సమకూర్చుకునే పరిస్థితి కనిపించడంలేదని అంటున్నాయి. కాగా, మే 3న లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే తమకు ఉపాధి లభిస్తోందని చిరువ్యాపారులు, సైకిల్‌, కారు పార్కింగ్‌ స్టాండ్ల నిర్వాహకులు చెబుతున్నారు.

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, నాందేడ్‌, గుంతకల్లు డివిజన్లు ఉన్నాయి. అయితే ఆయా డివిజన్ల కింద రోజుకు 280 నుంచి 350 వరకు మెయిల్‌, సూపర్‌ఫాస్ట్‌ రైళ్లు దేశంలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటాయి. ఒక్క సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచే రోజు 128 సాధారణ, 120 ఎంఎంటీఎస్‌ సర్వీసులు నడుస్తుంటాయి. నిత్యం 3.40 లక్షల మంది ప్రయాణం చేస్తుంటారు. సంక్రాంతి, ఉగాది, దసరా, దీపావళి పండుగలతోపాటు వేసవి సెలవుల్లో లక్ష మంది అదనంగా ఉంటారు. దక్షిణ మధ్య రైల్వేలో మెయిల్‌, సూపర్‌ఫాస్ట్‌ రైళ్ల ద్వారా నిత్యంరూ.10 కోట్ల ఆదాయం వస్తోంది. పార్సిళ్లు, సరుకు రవాణాతో మరో రూ.3 కోట్లు వస్తుంది. వీటితోపాటు స్టేషన్లలో ఏర్పాటు చేసిన క్యాంటీన్లు, తినుబండారాల కాంట్రాక్టులు, స్టేషన్‌ ప్రాంగణాల్లోని సైకిల్‌, కార్‌ పార్కింగ్‌ స్టాండ్ల ద్వారా ఏటా రూ. 6 నుంచి 8 కోట్ల ఆదాయం వస్తుంది. కరోనా దెబ్బకు రైలు బండి ముందుకు కదల్లేదు.

Exit mobile version