Salman Khan ANGRY Reaction on Indian Citizen Foolish Behaviour
కరోనా మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్డౌన్ను మే 3 వరకు పొడిగించారు. అయితే కరోనా కట్టడి కాకపోవడానికి కారణం కొందరు ఆకతాయిల పనే అని హీరో రాహుల్ రవీంద్రన్ అంటున్నారు ‘ఇంట్లోనే కూర్చోమని చెబుతుంటే వినకుండా రోడ్లపైకి వచ్చి.. ఈ మహమ్మారిని వ్యాప్తి చేస్తున్నారు. అలాంటి వారిని చూస్తుంటే కోపం వచ్చేస్తోంది అన్నారు హీరో కమ్ దర్శకుడు రాహుల్ రవీంద్రన్. తాజా ఇంటర్వ్యూలో లాక్డౌన్ గురించి మాట్లాడిన రాహుల్ రవీంద్రన్ ఈ వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి లాక్డౌన్ అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ ప్రాణాలను కాపాడుకునేందుకు మరోదారి లేదు కదా!. ఒకవైపు జనాలు చనిపోతున్నా కూడా కొందరు దీనిని చాలా తేలికగా తీసుకుంటున్నారు. అలాంటి వారిని చూస్తుంటే కోపం వచ్చేస్తుందన్నారు. ఇప్పటికైనా జాగ్రత్తలు పాటించాలని ఈ సందర్భంగా రాహుల్ కోరారు.
ఇక లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి రోడ్ల పైకి అనవసరంగా వస్తున్న వారిపై బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం చెప్పిన సూచనలు పాటించాలని, అందరు ఇళ్లకే పరిమితం కావాలని సూచించాడు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో షేర్ చేస్తూ, `మీరు దేశ జనాభా తగ్గించాలను కుంటున్నారా? ఈ పనిని మీ కుటుంబంతోనే మొదలు పెట్టాలనుకుంటున్నారా? డాక్టర్లు, నర్సులు తమ జీవితాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్నారు. అలాంటి వాళ్లపై రాళ్లు విసిరితే మీ ప్రాణాలను ఎవరు కాపాడతారు? ప్రార్థన చేసుకోవాలనుకుంటే మీ ఇంట్లో చేసుకోండి. బయటకు వచ్చి మీ కుటుంబ సభ్యుల ప్రాణాలను ఎందుకు ప్రమాదంలోకి నెడుతున్నారు?` అని ప్రశ్నించాడు.
అలాగే ప్రజలను పోలీసులు కొట్టడంపై కూడా స్పందిస్తూ.. `ఇంట్లో ఉన్న వారిని పోలీసులు కొట్టడం లేదు కదా` అన్నాడు. ఇక, కరోనా పాజటివ్ వ్యక్తులు ఆస్పత్రుల నుంచి పారిపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, `వారు చావడానికి వెళ్తున్నారా లేక బతకడానికి వెళ్తున్నారా` అని ప్రశ్నించాడు.