Scientists are suggesting that people should be Social distancing
మహమ్మారి కరోనా వైరస్ ఎవరికీ అంతుచిక్కడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 210దేశాల్లో 20 లక్షలమంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. అసలు మందు లేని ఈ కరోనాకు సంబంధించి ఇంకా కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరకలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాలానుగుణంగా వైరస్ వ్యాప్తిలో మార్పులు సంభవిస్తాయా..? కరోనా బారినుంచి కోలుకున్నాక వ్యక్తిలో రోగ నిరోధక శక్తి ఏ స్థాయిలో తగ్గుతుంది..? కరోనా బారిన పడిన వ్యక్తిలో తొలుత కనిపించే జలుబు, జ్వరం వంటి లక్షణాలకు కారణం ఏంటి..?కోవిడ్-19 బారిన పడకుండా శరీరంలోని రోగనిరోధక శక్తి అడ్డుకోవడం వల్లనే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? వంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకలేదని హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అందుకే ప్రపంచ దేశాల్లో కరోనా ప్రభావం తగ్గిపోయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందేనని శాస్త్రవేత్తలుసూచిస్తున్నారు. ” ప్రస్తుతానికి కరోనాకు మందు లేదు. ఈ వైరస్ను నియంత్రించేందుకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేవరకు ప్రజలంతా జాగ్రత్తలు పాటించాల్సిందే. ముఖ్యంగా సోషల్ డిస్టెన్సింగ్ 2022 వరకు ప్రజలు పాటించాల్సిందే. అప్పుడే ఈ మహమ్మారి బారిన పడకుండా రక్షణ పొందగలుగుతాం” అని శాస్త్రవేత్తలు అంటున్నారు. సోషల్ డిస్టెన్సింగ్కు సంబంధించిన నిబంధనలను ప్రభుత్వాలు కూడా ఒక్కసారిగా తొలగించకూడదని, దానివల్ల కరోనా మళ్లీ విజృంభించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అందువల్ల 2022 వరకు విడతల వారీగా నిబంధనలను తొలగించడమే మేలని సూచిస్తున్నారు.
ఇక ఇప్పటికే ప్రపంచ దేశాల్లో ఆర్థిక పురోగతి నిలిచిపోయిందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. లక్షల మంది ఉద్యోగులు ఇళ్లకే పరిమితమైపోయారని, దీనివల్ల లాక్ డౌన్ తొలగించే దిశగా అన్నిదేశాల్లో ప్రభుత్వాలపై ఒత్తిడి పెరుగుతోందని తెలిపారు. అయితే లాక్డౌన్ తొలగించినా పని ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించడం వంటి రక్షణ చర్యలు పాటిస్తే కొంతవరకు వ్యాధి బారిన పడకుండా కాపాడుకోగలుగుతామని వివరించారు. ముఖ్యంగా సోషల్ డిస్టెన్సింగ్, ఎక్కువమందికి వేగంగా కరోనా పరీక్షలు నిర్వహించడం వంటి చర్యలతో కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు.