Sharad Pawar slams Central’s decision to shift IFSC to Gujarat
ప్రధాని మోడీ వ్యవహరిస్తున్న తీరుపై మరాఠా యోధుడు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ గుర్రుగా ఉన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీకి పవార్ లేఖ రాశారు. ప్రపంచంలోనే వాణిజ్య పరంగా టాప్-10 సెంటర్లలో ఒకటిగా గుర్తింపుపొందిన ముంబైని కాదని అంతర్జాతీయ ఆర్థిక సేవా కేంద్రాన్ని (ఐఎఫ్ఎస్సీ) గుజరాత్లో ఏర్పాటు చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పవార్ తప్పుపట్టారు. ప్రతిపాదిత ఐఎఫ్ఎస్సీని ముంబైకి బదులుగా గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఏర్పాటు చేయాలనే నిర్ణయం పొరపాటు నిర్ణయమని, పూర్తిగా అనుచితమని అన్నారు.
‘కేంద్రం నిర్ణయంతో దేశానికి ఆర్థికపరమైన నష్టం కలగడమే కాదు, ముంబైకి ఉన్న అంతర్జాతీయ ఖ్యాతిని కూడా దిగజారుతుంది. ఇండియా జీడీపీలో 6.16, 25 శాతం పారిశ్రామిక ఉత్పత్తి ఇక్కడ్నించే వస్తోంది. దేశ ఆర్థిక లావాదేవీల్లో 70 శాతం మూలధన లావాదేవీలు ముంబై నుంచి జరుగుతున్నాయి’ అని పవార్ ప్రధాని రాసిన లేఖలో పేర్కొన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాలను కూడా పవార్ ప్రస్తావిస్తూ, ప్రభుత్వ సెక్యూరిటీల పరంగా మహారాష్ట్ర కంటిబ్ర్యూషన్ అసాధారణమని, గుజరాత్లో ఐఎఫ్ఎస్సీ ఏర్పాటు చేయాలనే ఆలోచన పూర్తిగా తప్పుడు సంకేతాలిచ్చే అనుచిత నిర్ణయమని అన్నారు.
ఇది మహారాష్ట్ర నుంచి ఆర్థిక సంస్థలు, వ్యాపార సముదాయాలను తరలించేందుకు ఉద్దేశించిన చర్యగా కనిపిస్తోందని విమర్శించారు. దీనివల్ల అనవసర రాజకీయ అశాంతి తలెత్తుతుందని పేర్కొన్నారు.
భారత బ్యాంకింగ్ రంగంలో రూ.145,00,000 కోట్లు డిపాజిట్లు ఉంటే, ఒక్క మహారాష్ట్ర వాటానే 22.8 సాతం ఉందని, ఆ తర్వాత 10 శాతంతో ఢిల్లీ, 7.8 శాతంతో ఉత్తరప్రదేశ్, 7.2 శాతంతో కర్ణాటక, 5.4 శాతంతో గుజరాత్ ఉందని ఏప్రిల్ 23న ఆర్బీఐ ప్రచురించిన గణాంకాలను పవార్ ప్రస్తావిస్తూ చెప్పారు.
కేంద్రం తీసుకున్న నిర్ణయం దిగ్భ్రాంతిని కలిగిస్తోందని, ముంబైకి ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యతను తగ్గించేలా కేంద్రం చర్య ఉందని పవార్ ధ్వజమెత్తారు. గణాంకాలు, మెరిట్ ఆధారంగా గుజరాత్‌కు బదులు ముంబైలోనే ఐఎఫ్ఎస్సీ ఏర్పాటు చేయాలన్నారు. ఈ విషయంలో ప్రధాని హేతుబద్ధంగా వ్యవహరించి, న్యాయబద్ధమైన నిర్ణయం తీసుకుంటారని తాను ఆశిస్తున్నట్టు పవార్ పేర్కొన్నారు. జాతీయ ప్రాధాన్యత అంశంగా తక్షణమే మోదీ పరిశీలించాలని కోరారు.