తమిళ నాట సంచలనం సృష్టించిన 96 చిత్రాన్ని తెలుగులో జానుగా రీమేక్ చేశారు.అక్కడ విజయ్ సేతుపతి, త్రిష క్రియేట్ చేసిన మ్యాజిక్‌ను తెలుగులో శర్వానంద్, సమంత రీ క్రియేట్ చేసేందుకు నేడు (ఫిబ్రవరి 7) ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి కోలీవుడ్‌లో 96 క్రియేట్ చేసిన రికార్డులను తెలుగులో జాను చేసిందా? సమంత, శర్వానంద్‌లకు జాను ఏ మేరకు పేరు తీసుకొచ్చింది? అనే విషయాలను ఓ సారి చూద్దాం.
నటీనటులు:
ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది రామ చంద్రన్, జాను అనే రెండు పాత్రల గురించే. వీటి చుట్టే, వారి గురించే కథ తిరుగుతూ ఉంటుంది. అయితే బాల్యం నాటి పాత్రల్లో నటించిన సాయి కిరణ్ కుమార్ , గౌరీ జీ కిషన్ తమ పాత్రల్లో చక్కగా నటించారు. శర్వానంద్, సమంతల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలాంటి పాత్రలు దొరికితే వారు ఎంత జీవిస్తారో ఇది వరకే చూశాం. సమంత, శర్వానంద్‌లు కాకుండా జాను, రామ చంద్రన్‌లే కనిపిస్తారు ప్రేక్షకులకు. ప్రతీ ఫ్రేమ్‌లో వీరి చూపించిన హావాభావాలు సినిమాను అందంగా మలిచాయి. ఎమోషనల్ సీన్స్‌లో ఇద్దరూ పీక్స్‌లో నటించారు. తమ పర్ఫామెన్స్తో వారిద్దరు ఈ సినిమాకు బలంగా మారారు.
దర్శకుడి పనితీరు..
ఒకసారి ఓ కథతో మ్యాజిక్ క్రియేట్ చేసిన దర్శకుడు.. మళ్లీ అదే కథతో వేరే నటీనటులతో అదే అద్భుతాన్ని రీ క్రియేట్ కొంచెం కష్టమే. అయితే సీ ప్రేమ్ కుమార్ అలాంటి కష్టాన్ని జయించినట్టు కనిపిస్తుంది. జాను సినిమాను చూస్తుంటే మధ్య మధ్యలో విజయ్ సేతుపతి, త్రిష గుర్తుకు వస్తే.. అది దర్శకుడి తప్పు కాదు.. నటీనటుల తప్పూ కాదు.. ప్రేక్షకులది అంతకంటే కాదు. ఎందుకుంటే 96 సినిమాతో క్రియేట్ చేసిన మ్యాజిక్ అలాంటిది మరి. అయితే ఒరిజినల్ సినిమాను చూడని ప్రేక్షకుడు.. రీమేక్‌ను చూస్తే మాత్రం కచ్చితంగా గతంలోకి వెళ్లి వస్తాడు. తెలుగులో రీమేక్ చేస్తున్నాము కదా అని అనవసరపు కమర్షియల్ హంగులకు పోకుండా.. తెరకెక్కించిన దర్శకుడు గట్స్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. అయితే ఈ కథను ఇంత స్లోగా చెప్పడమే మైనస్ అయ్యేలా కనిపిస్తుంది. ఓ నిజాయితీతో కూడిన ప్రయత్నం చేసి.. దర్శకుడు అందులో సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు.
స్వచ్చమైన ప్రేమకథలను ఆస్వాధించే వారికి జాను మంచి ఆప్షన్. రొటీన్ కమర్షియల్ తెలుగు చిత్రాలకు అలవాటుపడ్డ ప్రేక్షకులకు జాను ఓ చక్కటి జ్ఞాపకంగా మిగులుతుంది. అయితే ఇలాంటి చిత్రాలు బీ, సీ సెంటర్స్‌లో ఎంత వరకు ఆడతాయన్నది ప్రశ్నార్థకమే. కమర్షియల్ లెక్కల్లో చూసుకుంటే జాను ఏ రేంజ్ సక్సెస్‌ను అందుకుంటుందో చూడాలి.
మూవీ రేటింగ్ : 3.5/5