shashi tharoor shocking comments on rahul gandhi:
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, లోక్‌సభ పార్లమెంటు సభ్యుడు శశిథరూర్ అపుడప్పుడు సంచలన విషయాలు చెబుతూ ఉంటారు. తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించడం, పునరుద్ధరణ బాధ్యతలతో సోనియాగాంధీపై భారం మోపడం సమంజసం కాదని వ్యాఖ్యానించి సంచలనం రేపారు. పైగా గత ఏడాది కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ తిరిగి పార్టీ పగ్గాలు చేపడతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గాంధీయేతర నేత పార్టీ అధ్యక్ష పగ్గాలు తీసుకునే అవకాశాలను ఆయన తోసిపుచ్చారు. పూర్తి స్థాయి అధ్యక్షుడిని ఎన్నుకోవడం ద్వారా పార్టీ పునరుద్ధరణ సందేశాలు ప్రజల్లోకి వెళ్లాల్సి ఉందన్నారు. తాత్కాలిక చర్యగా సోనియాగాంధీ నియామకం జరిగిందని, అయితే ఆమెపై భారం మోపడం సమంజసం కాదనే అభిప్రాయం చాలా మందికి ఉందన్నారు.
గాంధీయేతరులకు పార్టీ పగ్గాలు అప్పగించే విషయంలో గాంధీ కుటుంబసభ్యులకు ఏవైనా భయాలు ఉన్నాయని అనుకుంటున్నారా అని ప్రశ్నించగా,, రాజీనామా అనంతరం రాహుల్ గాంధీనే స్వయంగా గాంధీ కుటుంబేతరులకు పార్టీ పగ్గాలు అప్పగించాలని చెప్పారని, అయితే అలా జరగలేదని శశిథరూర్ అన్నారు. గాంధీ కుటుంబానికి కాంగ్రెస్ కార్యకర్తల మనసుల్లో ఎప్పటికీ చెదరని ప్రత్యేక స్థానం ఉందనే విషయం తాము గుర్తించామని చెప్పారు. రాజస్థాన్, పంజాబ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పుదుచ్చేరిలో బలమైన, సమర్ధవంతమైన కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయని, ఆయా రాష్ట్రాల్లో సమర్ధ పాలన రోజురోజుకూ ప్రజల మన్ననలు అందుకుంటూ జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు పగ్గాలు అప్పగించాలనే భావన ప్రజల్లో బలపడుతోందని శశి అన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అచేతన పరిస్థితి కనిపిస్తోందని తాను అనుకోవడం లేదని శశిథరూర్ చెప్పారు.
గతంలోని విభేదాలను కూడా అధిగమించి, ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం ద్వారా మహారాష్ట్ర, జార్ఖాండ్‌లో ప్రభుత్వాలు ఏర్పాటు చేశామని, ఆ రాష్ట్రాల్లో చక్కటి పాలన సాగుతోందని అన్నారు. అలాంటప్పుడు పార్టీ చురుకుగా లేదని, స్తబ్దుగా ఉందని చెప్పడం సరికాద న్నారు.సంస్థాగత, వ్యవస్థాపగత సవాళ్లను అధిగమిచేందుకు పార్టీ పనిచేస్తోందని, ఈ సందేశాన్ని ఓటర్ల ముందుకు బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని శిశిధరూర్ అభిప్రాయపడ్డారు.రాహుల్ గాంధీ తన మనసు మార్చుకుని మరో సారి పార్టీ పగ్గాలు చేపడతారనే ఆశాభావం తమలో చాలా మందికి ఉన్నట్టు చెప్పారు. పార్టీని ఏకతాటిపై నడపగలిగే సామర్థ్యం ఆయనకు ఉందని, ఈ విషయంలో తాము ఏకాభిప్రాయంతో ఉన్నామని తెలిపారు. ఎంత త్వరగా ఆయన ఆయన అందుకు అంగీకరిస్తే అంత మంచిదని, తామంతా అందుకు స్వాగతిస్తామని చెప్పారు. అందుకు రాహుల్ నిరాకరిస్తే మాత్రం, దేశ ప్రజల అంచనాలకు అనుగుణంగా పార్టీకి ముందుకు తీసుకు వెళ్లేందుకు చురుకైన, పూర్తి స్థాయి నాయకత్వం కోసం అన్వేషించాల్సిన అవసరం పార్టీకి తప్పదని,అందుకు కసరత్తు చాలా అవసరమని అన్నారు.