Star Heroin mother madhu chopra supports modi:
మోడీకి బాసటగా స్టార్ హీరోయిన్ మదర్
ఇటీవల బాలీవుడ్‌కి చెందిన అనేక మంది తారలు, హాలీవుడ్ సెలబ్రిటీలు, నిర్మాతలు ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని విమర్శిస్తూ సోషల్ మీడియాలో స్పందించిన నేపథ్యంలోనే ప్రియాంకా చోప్రా తల్లి మధు చోప్రా షాకింగ్ కామెంట్స్ చేసారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో సీఏఏ వ్యతిరేక ఆందోళనలు, ఘర్షణలు, హింసాత్మక ఘటనలు చెలరేగిన నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీకి మధు చోప్రా బహిరంగ లేఖ రాశారు. ‘‘ప్రజా గళం’’ అనే శీర్షికతో ఆమె ట్విటర్లో దీన్ని పోస్టు చేశారు.
ఢిల్లీలో ఇటీవల చోటు చేసుకున్న మతకలహాలు, ఘర్షణలు, మరణాలకు ప్రధానిని బాధ్యుడిని చేస్తూ సమాజంలో పలు వర్గాలు ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఎలా నిలిచాయో చెబుతూ ఆమె తన లేఖ ప్రారంభించారు. ‘‘ప్రతిపక్షం మీకు (మోదీని) వ్యతిరేకంగా నిలిచింది. తీవ్రవాదులు, నేరగాళ్లు, మీడియాలోని ఏకపక్ష వాదులు, కుహనా మేధావులు, చివరికి పాకిస్తాన్ మీకు కూడా మీకు వ్యతిరేకంగా నిలించింది. కానీ నేను మీ వెనుక గట్టిగా నిలబడతాను.. ఎందుకంటే.. భారత దేశానికి మీరు అవసరం..’’ అని ఆమె పేర్కొన్నారు.
కాగా దేశ రాజధానిలో పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయని ఢిల్లీ పోలీసులు చెప్తున్నారు. ఇప్పటి వరకు ఈ హింసాకాండపై 123 ఎఫ్ఐఆర్లు నమోదైనట్లు ఢిల్లీ పోలీసు డిపార్ట్మెంట్ ప్రతినిధి రంధావా వెల్లడించారు. హింసాకాండలో పాల్గొన్న దాదాపు 630 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. సోషల్ మీడియాను చాలా జాగ్రత్తగా పోలీసు శాఖ మానిటర్ చేస్తోందని, సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఫేక్ న్యూస్‌ను నమ్మొద్దని సూచించారు. ఇప్పటి వరకు ఈ హింసాకాండలో జరిగిన దాడుల్లో దాదాపు 42మంది ప్రాణాలు కోల్పోయారు.