చేసింది తక్కువ సినిమాలే అయినా, రానా దగ్గుబాటి పాన్ ఇండియా క్రేజ్ దక్కించుకున్న తెలుగు కెరటం గా నిలిచారు. టాలీవుడ్‌తో పాటు మిగతా చోట్ల జెండా ఎగరేస్తున్న రానా బాహుబలి మూవీలో భల్లాల దేవుడి పాత్రతో అంతర్జాతీయ గుర్తింపు సాధించుకున్నాడు. ఇక తాజాగా నటించిన బాలీవుడ్ చిత్రం ‘హాథీ మేరీ సాథీ’ హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ఏప్రిల్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హీరో ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్ చేయడంతో ఇందులో ఏనుగు ముందు నిల్చొని ఆవేశంతో ఊగిపోతున్న రానా లుక్ అదిరిపోయిందంటూ అభిమానులు పొగడ్తలతో ముంచెత్తారు.
అయితే ఓ అభిమాని మాత్రం గతంలో రానా ఇంటర్వ్యూ ఇచ్చిన వీడియో పోస్ట్ చేశాడు. ‘నేను పదో తరగతి ఫెయిల్ అయ్యాను. కానీ, ఆ ఫలితాలు నా కలలు నెరవేర్చుకోకుండా ఆపలేక పోయాయి’ అని రానా అందులో పేర్కొన్నాడు. ఇలా వీడియో పోస్ట్ చేస్తూ,భల్లాలదేవపై సదరు నెటిజన్ సెటైర్ వేస్తూ, ‘ఎందుకంటే నా కుటుంబానికి పెద్ద ప్రొడక్షన్ కంపెనీ ఉంది’ అని కామెంట్ వేశాడు.
అయితే రానా తన ఆగ్రహాన్ని లోపలే అణచివేసుకుని ‘అందులో ఏమీ లేదు బ్రో. మనం నటన అనే ఆర్ట్‌ని నేర్చుకోకపోతే వెనక ఎంత పెద్ద నిర్మాణ సంస్థ ఉన్నా వేస్టే’ అంటూ కూల్‌గా చెప్పేందుకు ప్రయత్నించాడు. ఇక రానా సినిమా బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చాడు. ఆయన తండ్రి ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు. ఈయనకు సొంతంగా సురేశ్ బ్యానర్ ఉంది. విక్టరీ వెంకటేష్ అయితే రానాకు స్వయానా బాబాయ్. ఇక ఆయన తాతయ్య దివంగత డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ గా పలు భాషల్లో సినిమాలు చేసి గిన్నీస్ బుక్ లో ఎక్కారు.