Suresh Das, a migrant worker from Bihar, was brutally murdered
బ్రతుకు తెరువు కోసం ఎక్కడి నుండో హైదరాబాద్కు వచ్చి ఇక్కడ దారుణ హత్యకు గురి అయ్యాడు. నగర శివారులో రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల కేంద్రంలో బుధవారం బీహార్ రాష్ట్రానికి చెందిన సురేష్ దాస్ అనే వలస కార్మికుడు దారుణ హత్యకు గురి అయ్యాడు. వివరాలలోకి వెళ్తే ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన బగ్దేవ్రామ్ అలియాస్ హరిదాస్ (26), భార్య జశోదాదేవి (25)తో కలిసి కొన్నాళ్ల క్రితం భవన నిర్మాణ పనుల కోసం కొత్తూరు వలస వచ్చారు. వీరితో పాటు వీరు అద్దెకుంటున్న గదిలోనే బీహార్ రాష్ట్రానికి చెందిన సురేష్ దాస్ (34) కూడా ఉంటున్నాడు. సురేష్దాస్ భార్య లలితాదేవికి, జశోదాదేవికి దూరపు బంధుత్వం ఉండటంతో ముగ్గురు ఒకే గదిలో కలిసి ఉంటున్నారు.
ఇదిలా ఉండగా బుధవారం ఉదయం డాబాపై సురేష్దాస్ రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నాడు. అది చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా షాద్నగర్ ఏసీపీ సురేందర్, సీఐ చంద్రబాబు వెంటనే అక్కడికి చేరుకుని అక్కడ మృతదేహాన్ని పరిశీలించారు. సురేశ్ తలపై పదునైన ఆయుధంతో దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు అలాగే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అతడితో ఉండే హరిదాస్, జశోదాదేవి దంపతులు కనిపించకపోవడంతో పోలీసులు వారిని వెదికే పనిలో ఉన్నారు. దంపతుల ఆచూకీ లభిస్తేనే ఈ కేసులో ఛేదించ గలమని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.