Swami Swaroopanandendra Saraswati Shocking Comments on coronavirus
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. లాక్ డౌన్ లో మనదేశం కొనసాగుతోంది. రోజు రోజుకీ కేసులు పెరుగుతున్నాయి. ఇక కరోనా వైరస్ నియంత్రణపై విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి షాకింగ్ కామెంట్స్ చేశారు. కరోనా గురించి నైరాశ్యం వద్దని, భారతదేశం ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎన్నో చూసిందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కాలసర్పదోషం ప్రపంచాన్ని వెంటాడుతోందని ఆయన తెలిపారు. గ్రహ పరిస్థితుల కారణంగా కరోనా కంట్రోల్ కావడం లేదన్నారు.
అయితే ఏప్రిల్ 24 నుంచి దుష్ట గ్రహాల ప్రభావం తగ్గుముఖం పడుతుందని స్వామిజీ పేర్కొన్నారు. మే 5 తర్వాత పరిస్థితి అదుపులోకి వస్తుందని స్వరూపానందేంద్ర స్పష్టం చేశారు. కరోనా వైరస్ ప్రమాదకరమే అయినా భగవంతుని కృపతో ఆ ప్రభావం తగ్గుతుందని అన్నారు. జ్యోతిష్య శాస్త్రాన్ని పరిశీలిస్తే ఈ వైరస్ ప్రభావం సంవత్సరాల తరబడి ఉండదనిపిస్తోందన్నారు. కరోనా కారణంగా భారత దేశానికి అంతగా చేటు జరగదని పేర్కొన్నారు.
విశాఖ శారదాపీఠంలో రాజశ్యామల అమ్మవారి ఉపాసన చేస్తున్నామని…కరోనా ప్రభావాన్ని నివారించేందుకు జపాలు, హోమాలు, యజ్ఞ యాగాదులు నిర్వహించామని స్వామి తెలిపారు. ‘‘ప్రజలంతా భగవంతుడి రక్షణ కోరుకోండి. ఈ సమయంలో భగవంతుని నామస్మరణే భారతదేశానికి రక్షణ… లాక్ డౌన్ సమయంలో ఆధ్యాత్మిక జీవితాన్ని గడపండి. పిల్లల్లో ఆధ్యాత్మిక చింతన పెంచండి’’ అని స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి పిలుపునిచ్చారు.