T20 World Cup 2020
ఆస్ట్రేలియా గడ్డపై అక్టోబర్ నెలలో జరగనున్న పురుషుల టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్స్‌లో రిజర్వ్‌డే ఉంచాలని ఐసీసీ నిర్వహించే సమావేశంలో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రతిపాదించే యోచనలో వుంది. ఇటీవల ఆసీస్‌లో జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్స్‌కు రిజర్వ్‌డే ఉంచకపోవడంతో ఐసీసీ తీరుపై సర్వత్రా విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్-భారత్‌ల మధ్య జరగాల్సిన సెమీ ఫైనల్ మ్యాచ్ భారీ వర్షం కారణంగా రద్దయ్యింది. దానికి రిజర్వ్‌డే లేని కారణంగా గ్రూప్ దశలో అగ్రస్థానంలో ఉన్న భారత జట్టు ఫైనల్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. రిజర్వ్‌డే లేకపోవడం తో ఇంగ్లాండ్ మ్యాచ్ ఆడకుండానే టోర్నీని నుంచి నిష్క్రమించింది.
అయితే పురుషుల ప్రపంచకప్‌లో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండాలని.. ఐసీసీ నిర్వహించే సమావేశంలో సెమీస్‌కు రిజర్వ్‌డే గురించి క్రికెట్ ఆస్ట్రేలియా చర్చించే అవకాశం ఉందని ఐసీసీ ప్రతినిధి తెలిపారు. మహిళల ప్రపంచకప్‌కు రిజర్వ్‌డే ప్రతిపాదనను మరిచిన సీఏ.. ఈసారి మాత్రం ఆ తప్పిదం చేయకూడదనే భావనలో ఉందని తెలుస్తుంది. అయితే పురుషుల టీ20 ప్రపంచకప్‌లో రిజర్వ్‌డే ఉంటుందని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు సీఈవో కెవిన్ రాబర్డ్స్ ఆశాభావం వ్యక్తం చేశారు.