Saturday, May 15, 2021

Latest Posts

సీఎం ఉద్దవ్ భవితవ్యం ఏమౌతుంది

Talk about the rise of a constitutional crisis in Maharashtra

ఓ పక్క మహారాష్ట్రను కరోనా మహమ్మారి పట్టి పీడించడంతో  అధికారిక లెక్కల 5 వేల మందికి పైగానే కరోనా బాధితులున్నారు. అయితే మరోపక్క   మహారాష్ట్రలో రాజ్యాంగపరమైన సంక్షోభం తలెత్తే సూచనలున్నాయని టాక్.  ఎందుకంటే, ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే గత యేడాది నవంబర్ 28 న ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆ సమయంలో ఏ చట్ట సభ నుంచీ ప్రాతినిధ్యం వహించలేదు. దీంతో ఆయనను గవర్నర్ కోటా నుంచి ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలంటూ కేబినెట్ తీర్మానం చేసింది. ఆ గడువు ఈ నెల 28 తో ముగియనుంది. ఒకవేళ గవర్నర్ గనుక, సీఎం ఉద్ధవ్‌ను నామినేట్ చేయకపోతే మాత్రం ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది.  ఎందుకంటే, ఆర్టికల్ 164 ప్రకారం సీఎం గా గానీ, మంత్రిగా గాని  బాధ్యతలు చేపట్టిన వ్యక్తి ఆరు నెలల లోపు ఏదో ఒక చట్ట సభ నుంచి ఎన్నికవ్వాలి. ఇప్పుడు  డెడ్‌లైన్ దగ్గర పడడంతో  ఒక్కసారిగా మహారాష్ట్ర రాజకీయం రసకందాయంలో పడింది.

మార్చి 26 న తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నా, కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆ ఎన్నికలను వాయిదా వేసింది. ఈ నిర్ణయం ఉద్ధవ్ రాజకీయ ప్రస్థానంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఎన్సీపీ నేత, మంత్రి అజిత్ పవార్ రంగంలోకి దిగి, గవర్నర్ కోటా నుంచి ఉద్ధవ్‌ను ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలంటూ గవర్నర్ భగత్ సింగ్ కోషియారీని కోరారు. ప్రస్తుత అక్కడ గవర్నర్ కోటా నుంచి రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఆర్టికల్ 171 ప్రకారం గవర్నర్ సాహిత్యం, కళలు, సామాజిక కార్యకర్త, వివిధ కళల్లో నిష్ణాతులైన వారిని ఆయన కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేసే పూర్తి అధికారం ఉంది. అయితే ముఖ్య మంత్రి ఉద్ధవ్ వీటిలో  ఏ ఒక్క రంగానికీ చెందకపోగా, ఫక్తు రాజకీయ నేపధ్యమున్న   వ్యక్తి. ఎమ్మెల్సీగా నామినేట్ చేయడం అనేది గవర్నర్ విచక్షణాధికారానికి చెందింది. ఆయన ఏ వ్యక్తినైనా నామినేట్ చేయవచ్చు. ప్రశ్నించే అధికారమే కాదు, కనీసం కోర్టులో కూడా ఛాలెంజ్ చేసే అధికారం ఎవ్వరికీ ఉండదు. ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ను ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలంటూ మంత్రి అజిత్  సూచించిన దానిపై గవర్నర్ స్పందించ లేదు. దీనిపైనే అధికార శివసేన గవర్నర్‌పై తీవ్ర వ్యాఖ్యలు కూడా చేసింది.

‘‘రాజ్‌భవన్ కుట్రలకు కేంద్రం కాకూడదు, చరిత్ర అలాంటి వారిని క్షమించదు. గవర్నర్ కోషియారీకి బీజేపీతో అనుబంధం ఉందన్నది బహిరంగ రహస్యమే. సీఎం ఉద్ధవ్‌ను ఎమ్మెల్సీగా నామినేట్ చేయకుండా అడ్డుపడుతోంది ఎవరో?’’ అంటూ శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ తీవ్రంగా వ్యాఖ్యానించారు.  దీనిపై బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ స్పందిస్తూ, ‘‘ఈ సంక్షోభంలో గవర్నర్‌పై ఒత్తిడి తేవడం ఏమాత్రం సమంజసం కాదు. ముఖ్యమంత్రిని ఎమ్మెల్సీగా నామినేట్ చేయడంలో తమకెలాంటి అభ్యంతరమూ లేదు. అయినా ఇంకా సమయం ఉంది,  వేచి చూడాలి’’ అని అన్నారు. ఇక రాహుల్ నార్వేకర్, రామ్‌రావ్ వాడ్కుటే రాజీనామాల కారణంగా రెండు సీట్లు ఖాళీ ఏర్పడ్డాయి. వారు గనుక రాజీనామాలు చేయకపోతే వారి పదవీ కాలం జూన్‌లో ముగిసేది. అంటే వారి పదవీ కాలం ముగియడానికి ఏడాది కంటే తక్కువ సమయమే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ రెండు స్థానాలకు ఎన్నికలు జరపడం కానీ, ఇతరులను నామినేట్ చేయడానికి కానీ చట్టం అంగీకరించదని,  ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఎమ్మెల్సీగా 28 లోపు నామినేట్ కాకపొతే భవితవ్యం ఏమిటన్నది కాలమే చెప్పాలి.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss