TDP and Janasena dried up Ysrcp style on corona effect
ఏపీలో కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో జనసేన ,టిడిపి ఆందోళన వ్యక్తంచేశాయి. కర్నూలు జిల్లా జనసేన నేతలతో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కర్నూలులో కరోనా కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. జబ్బును దాచేస్తే దాగదని, మరింత పెరిగి పెద్దదవుతుందన్నారు. కరోనా విషయంలో మతం కోణం చూడొద్దని, ఎవరికీ ఆపాదించొద్దని హితవుపలికారు. రైతులు తమ పంటలు అమ్ముకోలేక నష్టపోతున్నారని, కష్ట కాలంలో రాజకీయాలు కాదని, రైతులను ఆదుకోవాలని సూచించారు. ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా స్పందించాలని పవన్ కోరారు.
ఇక టిడిపి అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ట్వీట్ చేస్తూ, లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ వైసీపీ నేతలు కరోనా వైరస్ను వేగంగా వ్యాపింపచేస్తున్నారని విమర్శించారు. విశాఖ ఎంపీ, మంత్రి ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు ఒకేచోట సమావేశమవడం లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. అదే వేదికను వైసీపీ ప్రభుత్వం తాత్కాలిక క్వారంటైన్ కేంద్రంగా వినియోగించుకుందన్నారు. చాలా మంది కరోనా పరీక్షల కోసం వేచి ఉండాల్సి వచ్చిందని చంద్రబాబు తెలిపారు.
టిడిపి నేత,మాజీ మంత్రి కొల్లు రవీంద్ర స్పందిస్తూ ఏపీకి పట్టిన డేంజర్ వైరస్ వైసీపీనేనని విమర్శించారు. కరోనా వైరస్ వ్యాప్తికి టీడీపీ నేతలు కుట్ర చేశారన్న మంత్రి మోపిదేవి వ్యాఖ్యలను ఆయన ఖండించారు. మంత్రి మోపిదేవి వ్యాఖ్యలు అత్యంత హేయమన్నారు. బాధ్యత గల మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు దురదృష్టకరం చెప్పారు. కరోనా వ్యాప్తికి వైసీపీ నేతలే కారణమని పేర్కొన్నారు.