TDP MLAs ready to join YSRCP if Jagan accepts:
అధికార వైసీపీలో పార్టీని బలోపేతం చేసే దిశగా అధినేత జగన్ అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీకి పనికి వస్తారు.. పార్టీని బలోపేతం చేస్తారు.. అనే వారికి పదవులు, కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు. అదే సమయంలో పార్టీకి ఉపయోగం ఉండరని భావిస్తున్న వారికి నిర్మొహమాటంగా ఎర్త్ పెడుతున్నారు. వచ్చే ఏడాది రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ హవా కొనసాగాలని నిర్ణయించుకున్న జగన్ ఆదిశగానే అడుగులు వేస్తున్నారు. పార్టీని బలోపేతం చేస్తున్నవారికి పదవులు ఇస్తూ.. ప్రోత్సహిస్తున్నారు.
అదే సమయంలో పార్టీకి గుదిబండలుగా మారుతున్నవారిని సాగనంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.టిడిపిని నుంచి వైసిపిలోకి రీఎంట్రీ ఇస్తామన్న వారికి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అటువంటివారిని తిరిగి తీసుకోటం ద్వారా టిడిపిని దెబ్బ కొట్టొచ్చని వ్యూహంగా ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రకాశం జిల్లా పరుచూరు నియోజకవర్గానికి చెందిన కీలక రాజకీయ నాయకుడు, ఎన్నికలకు ముందు వైసీపీకి జై కొట్టిన ఎన్టీఆర్ పెద్దల్లుడు.. దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయాలపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈయనను పార్టీలోకి తీసుకున్న జగన్.. చాలా ఆశలే పెట్టుకున్నారు. నియోజకవర్గంలో కొనసాగుతున్న టీడీపీ హవాను నిలువరించి వైసీపీ జెండా ఎగురవేస్తారని ఆయన అనుకున్నారు. అయితే, దగ్గుబాటి ఆ తరహా రాజకీయాలు చేయకపోగా..
పార్టీలో నేతలను కూడా కలుపు కొని పోయే పరిస్థితి కనిపించడం లేదు. మరీ ముఖ్యంగా జగన్.. దగ్గుబాటి ఒక్కరి మూలంగా ఆయన కుటుంబం అంతా కూడా వచ్చి తనకు జై కొడుతుందని భావించారు. అయితే, ఈ పరిస్థితి కూడా కనిపించలేదు. పైగా ఇప్పుడు పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఇక, దగ్గుబాటిని పార్టీలో కొనసాగించడం ఎందుకు? అని అనుకున్నారో ఏమో జగన్ ఇక్కడ కీలక నిర్ణయం తీసుకున్నారు. దగ్గుబాటి ఊహించని పరిణామం ఎదురైంది. ఇక్కడ పార్టీ ఇంచార్జ్‌గా ఉన్న, రావి రామనాథం బాబు ఎన్నికలకు ముందు దగ్గుబాటి వైసీపీలో చేరడంతో ఈ పరిణామాన్ని వ్యతిరేకించి టీడీపీలో చేరిపోయారు.
ఈ క్రమంలోనే దగ్గుబాటికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. దీంతో దగ్గుబాటి ఘోరంగా ఓడిపోయారు. అయితే, ఇప్పుడు దగ్గుబాటికి కూడా చెప్పకుండానే రావిని జగన్.. మళ్లీ పార్టీలోకి చేర్చుకున్నారు. రామనాథం బాబు పార్టీలో చేరినప్పుడు కనీసం దగ్గుపాటి లేదా ఆయన కుమారుడు చెంచురామయ్యలలో ఎవ్వరూ లేరు. కేవలం జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డితో పాటు బాపట్ల ఎంపీ నందిగం సురేష్, సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం జగన్ ఉన్న బిజీ షెడ్యూల్ నేపథ్యంలో పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకే అపాయింట్ మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు.
ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు పార్టీని వీడి వెళ్లిపోవడంతో పాటు పార్టీ అభ్యర్థి ఓటమికి కంకణం కట్టుకున్న నేతను పిలిచి మరీ పార్టీలో చేర్చుకునేందుకు జగన్ ఆసక్తి చూపడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. రామనాథం వైసీపీ రీ ఎంట్రీ జగన్ సమక్షంలో జరిగింది. ఆయనను స్వయంగా పార్టీలోకి ఆహ్వానించిన జగన్.. త్వరలోనే ఆయన నియోజకవర్గ ఇంచార్జ్‌గా కూడా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ పరిణామంతో దగ్గుబాటికి పొమ్మనకుండానే పొగబెడుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి ఆయన ఏం చేస్తారో చూడాలి.