Telangana BJP president MP Bandi Sanjay Shocking Comments:
అనూహ్యంగా తెలంగాణ బీజేపీ అధ్యక్ష పీఠం బండి సంజయ్ కి అప్పగించడంపై సర్వత్రా పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. దీనిపై సంజయ్ స్పందిస్తూ, ‘నన్ను అధ్యక్షుడిగా ప్రకటించిన మోదీ, అమిత్ షా, నడ్డాకు ధన్యవాదాలు. తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు నిరంతరం కృషి చేస్తా బీజేపీలో సామాన్య కార్యకర్తగా ఉన్న తనకు అధ్యక్ష పదవి ఇవ్వడం ఆనందంగా ఉంది. నిజానికి అధ్యక్షుడిని అవుతానని తాను ఎప్పుడూ అనుకోలేదు. తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదుగుతోంది. అందరిని కలుపుకొని బీజేపీ బలోపేతానికి కృషి చేస్తా’అని వివరించారు.
కేంద్రం నిధులను మళ్లిస్తూ.. కేంద్ర సంక్షేమ పథకాల పేర్లు మారుస్తూ ప్రజలను వంచిస్తున్న తెలంగాణ అధికార పార్టీ బండారాన్ని బయటపెడతామని బండి సంజయ్ హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాలలో బీజేపీ బలంగా లేదనడం అవాస్తవమని పేర్కొంటూ,నలుగురు పార్లమెంటు సభ్యులు గెలిచినప్పుడు కూడా తమకు గ్రామీణ ప్రాంతాల్లో ఓట్లు వేసి ప్రజలు ఆదరించారని చెప్పారు. ప్రజాస్వామ్య తెలంగాణ ఏర్పాటుకు కృషి చేస్తామని వ్యాఖ్యానించారు. గతంతో పోలిస్తే తెలంగాణలో బీజేపీకి ఓటు బ్యాంకు విపరీతంగా పెరిగిందని వ్యాఖ్యానించారు.
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ అని తెలంగాణ ప్రజలు విశ్వస్తున్నారని చెప్పారు. ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేసి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న టీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెబుతామన్నారు. తెలంగాణ బీజేపీలో సీనియర్లు మధ్య సమన్వయం లేదన్న వార్తలు, అభిప్రాయ భేదాలు ఉన్నాయన్న మాట అవాస్తవమన్నారు. నోరు తెరిస్తే అబద్ధాలతో కాలం వెళ్లబుచ్చే సీఎం కేసీఆర్ మాటలను ఎవ్వరు విశ్వసించడం లేదని సంజయ్ అన్నారు.