తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 120 మున్సిపాలిటీలకు 9 కార్పొరేషన్లకు ఎన్నికలు ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 80 శాతానికి పైగా పోలింగ్ నమోదు అయ్యింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా చిన్న చిన్న ఘటనలు మినహా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు ఉదయం నుంచే పెద్ద ఎత్తున తరలివచ్చారు. పోలింగ్ ముగిసే సమయానికి కూడా పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలలో బారులు తీరారు. దీంతో పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఏర్పడింది.
కొత్త మున్సిపాలిటీలు చౌటుప్పల్, ఆదిభట్ల, తిరుమలగిరి, మోత్కుర్ లో అత్యధికంగా పోలింగ్ నమోదైంది. హైదరాబాద్ నగర శివారు మణికొండ, నిజాంపేట్లో అత్యల్ప పోలింగ్ నమోదైంది. డబీర్పుర ఉప ఎన్నికలోనూ అత్యల్ప పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సాయంత్రం మూడు గంటల వరకు దాదాపు 67శాతం పోలింగ్ నమోదైంది. 120 మున్సిపాలిటీల్లోని 2647 వార్డులు, 9 కార్పొరేషన్లలో 324 డివిజన్లలో పోలింగ్ జరిగింది. మున్సిపాలిటీలలో 11,179 మంది అభ్యర్థులు పోటీ చేయగా, కార్పొరేషన్లలో 1747 మంది అభ్యర్థులు పోటీ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాల్టీల్లో కలిపి మొత్తం మీద 12,926 మంది అభ్యర్థులు మున్సిపల్ ఎన్నికల్లో తలపడ్డారు. కాగా, ఇప్పటికీ ఓటు వేసేందుకు చాలా మంది పోలింగ్ కేంద్రాల్లో క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఐదు గంటల లోపు వచ్చి క్యూలైన్లలో వేచి ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు