ఇప్పుడు ఎపి రాష్ట్ర శాసన మండలి భవితవ్యంపై చర్చ జోరందుకుంది. అయితే దేశంలో పార్లమెంట్ చూస్తే ప్రజలనుంచి ఎన్నికైన సభ్యులతో లోకసభ,వివిధ వర్గాలు,ఆయా ప్రాంతాల నుంచి వచ్చి సభ్యులతో రాజ్యసభ ఉంటాయి. రాష్ట్రంలో కూడా శాసనసభ,శాసనమండలి అలాగే ఉంటాయి. కానీ చాలా రాష్ట్రాల్లో మండలి లేదు. ఇక ఏపీలో ఒకప్పుడు మండలి లేదు. తెలుగు ప్రజల ఆరాధ్యదైవంగా భావించే ఎన్టీఆర్ కి పట్టుదల చాలా ఎక్కువ. కొన్ని విషయాల్లో ఫిక్స్ అయితే జరిగిపోవాల్సిందే. ప్రజలు నేరుగా ఎన్నుకునే శాసనసభ అనే వేదిక ఉన్నప్పుడు.. పరోక్ష పద్దతిలో ఎంపిక చేసే మండలి అవసరమా? అని ఆయన ఫీల్ అయ్యేవారు.ఆయన అలా అనుకోవటానికి కారణం మరొకటి ఉంది కూడా.పార్టీ పెట్టిన తొమ్మిదినెలలకే అధికారాన్ని హస్తగతం చేసుకున్న ఎన్టీఆర్ కు అసెంబ్లీలో తిరుగులేని అధికారం ఉంటే, మండలిలో మాత్రం అస్సలు అధిక్యత ఉండేది కాదు.
ఇక రోశయ్య లాంటి ఉద్దండ నేతలు అడిగే ప్రశ్నలకు ఎన్టీఆర్ కి చిరాకు పుట్టేది. అసలు ఇదంతా కూడా మండలి ఉన్నందుకే కదా? దాన్ని తీసేస్తే పోలె.. అని ఎన్టీఆర్ అనుకున్నదే తడవుగా ఆ దిశగా అడుగులు వేశారు. అందుకే తాను అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే మండలి రద్దు చేయాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. అయితే 1983 మార్చి 24న అసెంబ్లీ ఆమోదించిన తర్మానానికి కేంద్రంలో ప్రధానిగా ఉన్న ఇందిరమ్మ మోకాలడ్డుపెట్టటంతో ఆ ప్రయత్నం సఫలం కాలేదు. అప్పటి ఏపీ మండలిలో 90 మంది సభ్యులు ఉంటే, అందులో ఆరుగురు మాత్రమే టీడీపీ సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్ అధిక్యతను జీర్ణించుకోలేని ఎన్టీఆర్, మండలిని రద్దు చేయాలని భావించారు.
తన నిర్ణయాన్ని కేంద్రంలోని ఇందిరమ్మ ప్రభుత్వం అడ్డుకోవటాన్ని తట్టుకోలేకపోయిన ఎన్టీఆర్.. సుప్రీంకోర్టులో సవాలు చేశారు. అయితే.. కేంద్రం అనుమతితోనే మండలి రద్దు చేయాలన్న విషయాన్ని కోర్టు స్పష్టం చేయటంతో తాత్కాలిక మౌనాన్ని ఆశ్రయించారు. అనంతరం 1985 ఏప్రిల్ 30న మరోసారి మండలిని రద్దు చేయాలని పావులు కదిపారు. గతంలో తాను చేసిన పొరపాటు రిపీట్ కాకుండా.. కేంద్రంతో ముందుగానే మాట్లాడుకోవటంతో ఎన్టీఆర్ ప్రభుత్వ నిర్ణయాన్ని అప్పట్లో కేంద్రంలో పవర్ ఉన్న రాజీవ్ ప్రభుత్వం ఓకే చెప్పింది. దాంతో మండలి రద్దయింది. 1989లో అప్పటి సీఎం డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మండలిని పునరుద్ధరించాలని చేసిన ప్రయత్నానికి కేంద్రం అంగీకాయించలేదు. అయితే 2004ఎన్నికల ముందు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మండలి పునరుద్ధరిస్తానని హామీ ఇచ్చి,అధికారంలోకి వచ్చాక మాట ప్రకారం పావులు కదిపారు. 2004 జులై 8న వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదిన కానుకగా శాసనమండలి పునరుద్ధరణ ప్రక్రియ ప్రారంభించగా, 2007మార్చి30న ఏర్పడింది. ఇప్పుడు మండలి భవితవ్యంపై చర్చకు దారితీస్తోంది.