వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత – ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో బిజెపితో వైసిపి పొత్తు ఊహాగానాలకు రెక్కలు వచ్చాయి. కేంద్రంలోని ఎన్డీయే కూటమిలోకి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరుతుందనే వార్తల తో పాటు కేంద్ర మంత్రి మండలిలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి మూడు బెర్తులు ఖరారు అయినట్టు ప్రచారం సాగింది. అంతటి ఆగకుండా, కేంద్రంలో మంత్రి పదవులు పొందే ముగ్గురూ ఎవరో అనే విషయంలో కూడా రకరకాల పేర్లు కూడా వినిపించాయి.
వైఎస్ షర్మిల , గోరంట్ల మాధవ్ , సురేష్ ఇలా కొన్ని పేర్లు కూడా కేంద్ర మంత్రి పదవులకు వినిపించాయి. రెండు మంత్రి పదవులు – కాదు మూడు పదవులు అంటూ టాక్ వచ్చింది. దీనికి కారణం జగన్ వరసగా రెండు సార్లు ఢిల్లీ వెళ్లడమే. అప్పటి నుంచే ఇలాంటి ఊహాగానాలకు ఊపు వచ్చింది.ముందుగా ప్రధాని మోడీతో సమావేశం అయిన సీఎం జగన్ ఆ తర్వాత కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యారు.
దీంతో ఇదంతా కేంద్ర ప్రభుత్వంలో చేరే తతంగమే అనే టాక్ బయలుదేరింది. అయితే అలాంటిదేమీ లేదని వైసిపి అంటోంది . తాజాగా ఆ పార్టీ నేత – విశాఖ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ ఈ ఊహాగానాలపై స్పందిస్తూ, తమకు ఏ జాతీయ పార్టీతోనూ పొత్తు ఉండదని ప్రకటించారు. కాంగ్రెస్ తో కానీ – బీజేపీతో కానీ పొత్తు పెట్టుకోమన్నారు. ఎన్నికల్లో తాము ప్రతి సారీ ఒంటరిగానే పోటీ చేశామని – ఒంటరిగానే విజయం సాధించామని.. అలాంటిది ఇప్పుడు తాము బీజేపీతోనో – మరో పార్టీతోనో పొత్తు పెట్టుకోవాలసిన అవసరం లేదని ఆయన స్పష్టం చేసారు. ఇది కరెక్టేనా, ఇక పొత్తు ఊహాగానాలకు తెరపడుతుందా చూడాలి.